అక్షరటుడే, వెబ్‌డెస్క్: Betting Case | బెట్టింగ్ రాకెట్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్రను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం అరెస్టు చేశారు. భారీ స్థాయిలో అక్రమ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌కు (Betting Racket) సంబంధించి దేశ్యాప్తంగా 31 ప్రదేశాలలో నిర్వహించిన సోదాల తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూరు, హుబ్లి, ముంబై, జోధ్‌పూర్, గోవా, గ్యాంగ్‌టక్ వంటి నగరాల్లో శుక్ర, శనివారాల్లో ఈడీ సోదలు (ED Raids) చేపట్టింది. బిగ్ డాడీ క్యాసినో, ఓషన్ రివర్స్ క్యాసినో, పప్పీస్ క్యాసినో ప్రైడ్, ఓషన్ 7 క్యాసినో. పప్పీస్ క్యాసినో గోల్డ్ అనే ఐదు ప్రసిద్ధ క్యాసినోలను కూడా లక్ష్యంగా చేసుకుని సోదాలు జరిగాయి. రెండ్రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో దుబాయ్ నుంచి కార్యకలాపాలు నిర్వహస్తున్న బహుళ క్యాసినోలతో సంబంధాలు ఉన్న పెద్ద బెట్టింగ్ నెట్‌వర్క్ (Betting Network) వెలుగు చూసింది.
Betting Case | ఆన్లైన్లో బెట్టింగ్
కింగ్ 567, రాజా 567 వంటి పేర్లతో వీరేంద్ర (MLA K.C. Veerendra) అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ల శ్రేణిని నిర్వహిస్తున్నాడని ఈడీ తెలిపింది. అతని సోదరుడు కె.సి. తిప్పేస్వామి దుబాయ్‌లోని డైమండ్ సాఫ్ట్‌టెక్ (Diamond Softtech), టీఆర్‌ఎస్ టెక్నాలజీస్ (TRS Technologies), ప్రైమ్9 టెక్నాలజీస్‌లో ఉన్న మూడు కంపెనీల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ సంస్థలు బెట్టింగ్ కార్యకలాపాల కోసం గేమింగ్ సంబంధిత కాల్ సెంటర్ సేవలను అందిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ (Dubai) కేంద్రంగా జరిగిన ఈ కార్యకలాపాలు అక్రమ నిధుల అక్రమ బదిలీ, అంతర్జాతీయంగా అక్రమ నిధుల సమీకరణకు కేంద్రంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
Betting Case | భారీగా నగదు స్వాధీనం
విస్తృతమైన సోదాల సమయంలో, అధికారులు సుమారు రూ.12 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు, ఇందులో రూ. కోటి విదేశీ కరెన్సీ కూడా ఉంది. అదనంగా, సుమారు రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులు, నాలుగు ఖరీదైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల ప్రకారం పదిహేడు బ్యాంకు ఖాతాలు, రెండు బ్యాంకు లాకర్లను సీజ్ చేశారు. వీరేంద్ర సోదరుడు కె. సి. నాగరాజ్, నాగరాజ్ కుమారుడు పృథ్వీ ఎన్ రాజ్ నివాసం నుంచి భారీగా నగదు, నగలతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.