అక్షరటుడే, వెబ్‌డెస్క్: Muthyala Sunil Reddy | జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సునీల్‌రెడ్డిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (Directorate General of GST Intelligence) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ముత్యాల సునీల్‌రెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా సైతం కొనసాగుతున్నారు. అధికారులు సేకరించిన సమాచారం ఆధారంగా.. మోసపూరిత నెట్‌వర్క్‌ను నడుపుతున్న ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్‌రెడ్డి కూడా ఉండటం గమనార్హం.
Muthyala Sunil Reddy | రూ.28 కోట్ల ఎగవేత
రాష్టవ్యాప్తంగా పన్ను ఎగవేతకు పాల్పడిన వారిని గుర్తించడానికి డీజీజీఐ అధికారులు (DGGI Officers) ఇటీవల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సునీల్‌రెడ్డి రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేశాడని గుర్తించారు. మూడు నెలల గడువు ముగిసినా జీఎస్టీ చెల్లించకపోవడంతో తాజాగా జీఎస్టీ చట్టం 2017 ప్రకారం అరెస్ట్ చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీగా ఉన్న ఆయన రూ.28.24 కోట్ల జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేశారు. అయితే దానిని ప్రభుత్వానికి చెల్లించలేదని అధికారులు పేర్కొన్నారు. మరో వ్యక్తి ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చేతన్ ఎన్ సైతం రూ.22 కోట్ల విలువైన నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (Input Tax Credit) సృష్టించి మోసం చేశాడు. అతడిని సైతం అధికారులు అరెస్ట్ చేశారు.
కాగా సునీల్‌రెడ్డి కాంగ్రెస్‌లో కీలకంగా కొనసాగుతున్నారు. 2018లో ఆయన బాల్కొండ (Balkonda) నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి వేముల ప్రశాంత్‌రెడ్డిపై మరోసారి ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన నేత జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశం అయింది.