అక్షరటుడే, వెబ్డెస్క్: Bihar results | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar assembly elections) కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అధికార ఎన్డీయే కూటమి (NDA alliance) 202 స్థానాల్లో విజయం సాధించగా.. మహఘట్బంధన్ కూటమి (Mahaghatbandhan alliance) 34 స్థానాలకే పరిమితమైంది.
61 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఆరు చోట్ల మాత్రమే గెలిచింది. దీంతో బీహార్ ఓటమిపై ఆ పార్టీ పోస్టుమార్టం నిర్వహిస్తోంది. బీహార్ ఓటమిపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే (Congress president Kharge) నివాసంలో పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్ తదితరులు హాజరయ్యారు. మీటింగ్ అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ.. బీహార్ ఫలితాన్ని నమ్మలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఫలితాలపై తమతో పాటు ప్రజలకూ అనుమానాలు ఉన్నాయన్నారు. ఎన్నికల కమిషన్ తీరుపై సందేహాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఓటమిపై పూర్తిస్థాయిలో సమీక్ష జరుపుతామని తెలిపారు.
Bihar results | మోసంతో గెలిచింది
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మోసం ద్వారా గెలిచిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. భారత ప్రజాస్వామ్యం చాలా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. బీహార్‌లో రిగ్గింగ్ జరిగింది అని ఆరోపించారు. హర్యానాలో కూడా తాము ఇదే చెప్పామన్నారు. ఇప్పటివరకు తాము లేవనెత్తిన అంశాలపై ఎన్నికల కమిషన్ స్పందించలేదన్నారు. ప్రజలు NDAకి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, ఆ ఓటు నమోదు కావడం లేదన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు, ప్రజా నిరసనలతో తాము ముందుకు సాగుతామని తెలిపారు.
