అక్షరటుడే, కామారెడ్డి : BC Declaration | గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. అధికారంలోకి వస్తే 42 శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ సాక్షిగా వెల్లడించారు.
అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్‌పై (BC Reservation) అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. ప్రస్తుతం బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండగా అమలుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం అడ్డుపడితే ఆ నెపం కేంద్రంపై నెట్టేసి స్థానిక ఎన్నికల్లో (Local Elections) ప్రచారం చేసుకునేలా కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది. ఒకవేళ గవర్నర్ ఆమోదం పొందితే ఇచ్చిన హామీని అమలు చేశామని ప్రచారం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది.
BC Declaration | కామారెడ్డి పట్టణంలో..
బిల్లు ఆమోదం పొందకపోతే పార్టీ పరంగా 42 శాతం టికెట్స్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లేలా కాంగ్రెస్ ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చామో అక్కడే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సంబరాలు జరిపే యోచనలో కాంగ్రెస్ (Congress Party) అధినాయకత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి పట్టణంలో ఈ నెల 15న బీసీ రిజర్వేషన్ అమలుకు ముందడుగు వేసిన సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ, కర్ణాటక సీఎంలు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), సిద్ధరామయ్య పాల్గొననున్నారు.
ఈ మేరకు సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో ఆదివారం బహిరంగ సభ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు.
BC Declaration | ఇచ్చిన మాట నిలుపుకున్నాం..
– షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారు
కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకం నిలుపుకుందన్నారు. నాడు కులగణన సర్వే జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు తమ వివరాలు ఇవ్వవద్దని బహిరంగంగా పిలుపునిచ్చారని గుర్తు చేశారు. వివరాలను ఎవరికి పడితే వారికి ఎలా ఇస్తామంటూ మాట్లాడారన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలను పిలిచి మరీ బహిరంగ సభ పెట్టి సంబరాలు జరుపుకుంటామని పేర్కొన్నారు.