అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బీర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై గౌరవం లేదన్నారు.
అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్‌కుమార్ (Speaker Prasad Kumar) బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను ఆయన కొట్టేశారు. వారు పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఉపఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఫిరాయింపు MLAలు ఎప్పుడో అనర్హులని స్పష్టం చేశారు. స్పీకర్ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధమన్నారు.
KTR | వారే చెప్పారు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ పార్టీ (Chief Minister Revanth Reddy) ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి నేటి స్పీకర్ నిర్ణయం వరకూ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని కేటీఆర్ అన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేక సార్లు చెప్పారని గుర్తు చేశారు. అయినా వారిపై ఎందుకు వేటు వేయలేదని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఫొటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని రాహుల్ గాంధీని (Rahul Gandhi) ఎద్దేవా చేశారు. తండ్రి చేసిన చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ చరిత్రలో మిగిలిపోతారన్నారు. కాగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్‌గాంధీ హయాంలో తీసుకు వచ్చారు.
KTR | ప్రజలు ఎప్పుడో ప్రకటించారు
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతకు భయపడే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు అంటే భయపడుతోందన్నారు. అందుకే పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. గోడ దూకిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాపాడినట్టు అనుకున్నా.. ప్రజాక్షేత్రంలో వారిని అనర్హులుగా ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడో ప్రకటించారన్నారు.