అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy BRS | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల పేరుతో కక్ష సాధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్(Former MLA Nallamadugu Surender) అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రాద్ధాంతం చేస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్‌పై లేనిపోని అవినీతి ఆరోపణలు మోపడం ద్వారా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్(KCR)పై జరిగే కుట్రను తెలంగాణపై జరిగిన కుట్రగా చూడాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత కేసీఆర్‌కు ఉందన్నారు. కేసీఆర్‌పై చేసిన కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందన్నారు.
రైతులు యూరియా లేక పడిగాపులు కాస్తున్నారని రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయిందని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) లోపు ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేశాకే.. ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగేందుకు వస్తే.. ప్రజాక్షేత్రంలో ప్రజలు తిరగబడతారని, స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు.
భారీవర్షాల కారణంగా నియోజకవర్గ పరిధిలో అనేక పంటలు దెబ్బతిన్నాయని రోడ్లు ధ్వంసం అయినా కూడా ఇప్పటికీ మంత్రులు రాకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు సైతం నియోజకవర్గంలో పర్యటించకుండా సమీక్షలకే పరిమితమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదిమూలం సతీష్, ముదాం సాయిలు, రాజేశ్వర్, శ్రీను నాయక్, ఏగుల నర్సింలు, అరవింద్ గౌడ్, పృథ్వీరాజ్, ఇమ్రాన్, బబ్లు, దయాకర్, ఎరుకల సాయిలు, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ విషప్రచారం చేస్తోంది..
అక్షరటుడే, బాన్సువాడ: కాళేశ్వరం కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం విషప్రచారం చేస్తోందని బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జుబేర్, రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని ఖండిస్తూ మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
రాష్ట్రాన్ని పాలించడం చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లు కుట్రపన్ని మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై సీబీఐ విచారణకు ఆదేశించి ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. 37లక్షల ఎకరాలకు నీరు అందించడానికి నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు యూరియా అందించక ధర్నాలు, రాస్తారోకోలు చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోచి గణేష్, రమేష్ యాదవ్, శివ సూరి, గౌస్, మహేష్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ పట్టణంలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు