అక్షరటుడే, బోధన్: MLA Sudarshan Reddy | పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అన్నారు. బోధన్ మండలంలో శుక్రవారం ఆయన పర్యటించారు.
మండలంలోని పెగడాపల్లి, బర్దిపూర్ గ్రామాల్లో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల కోసం రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
ఇల్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా రూ.5లక్షలు అందిస్తూ వారికి సొంతింటికల నెరవేరుస్తోందన్నారు. అదేవిధంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణసౌకర్యం అందిస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామన్నారు. పదేళ్ల నుంచి బోధన్ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. తద్వారా అభివృద్ధి జరుగుతోందని సుదర్శన్ రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గంగా శంకర్, బోధన్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శీలం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

