అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ (Congress party) అనూహ్యంగా చిక్కుల్లో పడింది. పదునైన విమర్శల ద్వారా కేంద్రాన్ని నిందించాలని భావించిన రాహుల్‌గాంధీ (Rahul Gandhi), ప్రియాంకగాంధీ (Priyanka Gandhi) చివరి క్షణంలో వెనక్కి తగ్గారు. ఇన్నాళ్లు కేంద్రంపై నిప్పులు కురిపించిన రాహుల్‌తో పాటు ప్రియాంక కూడా అనూహ్యంగా చర్చకు దూరంగా ఉన్నారు. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంతో పాటు విమర్శలకు తావిచ్చిన నేపథ్యంలో వారు లోక్‌సభలో చర్చకు దూరంగా ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Operation Sindoor | చర్చకు దూరంగా కీలక నేతలు
ఆపరేషన్ సిందూర్‌పై (Operation Sindoor) మొదటి నుంచి రాహుల్‌గాంధీ కేంద్రాన్ని తప్పుబడుతూనే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి ఆపరేషన్‌ను నిలిపి వేశారని, సైన్యం చేతులు కట్టేశారని, కేంద్ర నిర్ణయం వల్ల భద్రతా బలగాలకు నష్టం జరిగిందని, ఫైటర్‌జెట్లను కోల్పోవాల్సి వచ్చిందని.. ఇలా పలు ఆరోపణలు చేశారు. అంతేకాదు, లొంగిపోవడం ప్రధాని నరేంద్ర మోదీకి (Prime Minister Narendra Modi) అలవాటేనని విమర్శలు గుప్పించారు. అయితే, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తరుణంలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరపాలని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై కేంద్రం సోమవారం లోక్‌సభలో (Lok Sabha), మంగళవారం రాజ్యసభలో (Rajya Sabha) చర్చ చేపట్టాలని నిర్ణయించింది. సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో అనూహ్యంగా కాంగ్రెస్ పక్ష నేత రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంకగాంధీ మాట్లాడలేదు. సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గగోయ్‌తో పాటు పలువురు ఎంపీలు మాత్రమే మాట్లాడారు.
Operation Sindoor | చిదంబరం వ్యాఖ్యలతో..
లోక్‌సభలో చర్చ ద్వారా కేంద్రంపై నిప్పులు కురిపించాలని భావించిన రాహుల్‌గాంధీ చర్చకు దూరంగా ఉండిపోయారు. ప్రియాంకగాంధీ సైతం మాట్లాడలేదు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కాంగ్రెస్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఓ చానల్‌కు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిదంబరం చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంతో పాటు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam terror attack) పాల్పడిన వారు పాకిస్తాన్ వారేనని చెప్పడానికి ఆధారాలేమిటి? వారు ఎక్కడి నుంచి, ఎలా వచ్చారు? బహుశా దేశీయ ఉగ్రవాదులే ఈ మరణ హోమానికి పాల్పడి ఉండవచ్చన్న ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చిదంబరం వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్‌కు మద్దతునిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మరోసారి తన వైఖరిని బయట పెట్టుకుందని బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతున్న రోజే ఈ వ్యాఖ్యలు బయటకు రావడం, అన్ని వైపులా నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో మిన్నకుండి పోవాల్సి వచ్చిందన్న భావన వ్యక్తమవుతోంది.
Operation Sindoor | బీజేపీ ఎదురుదాడి..
మరోవైపు, లోక్‌సభలో అధికార పక్షంపై దాడి చేయాలని భావించిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) బీజేపీ చేసిన ఎదురుదాడితో ఇరుకున పడినట్లయింది. పహల్గామ్ దాడికి పాల్పడిన నిందితులు భారత్‌కు ఎలా వచ్చారు.? నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని కాంగ్రెస్ ప్రశ్నించగా, బీజేపీ (BJP Party) ఎదురుదాడికి దిగింది. తమ పాలనలో ఒకటి, అరా మాత్రమే ఉగ్రదాడులు జరిగాయని, కానీ కాంగ్రెస్ హయాంలో తరచూ దాడులు జరిగేవని, 8 వేల మందికి పైగా ప్రజలు ఉగ్రదాడుల్లో మృతి చెందారని అధికార పక్షం విమర్శించింది. వాళ్లలా తాము చేతులు ముడుచుకు కూర్చోలేదని, పాకిస్తాన్‌లోకి వెళ్లి మరీ వారిపై దాడులు చేసి వచ్చామని తెలిపింది. బీజేపీ ఎదురుదాడితో కాంగ్రెస్ మిన్నకుండి పోవాల్సి వచ్చింది.
