అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో గెలవడంతో కాంగ్రెస్ (Congress) పార్టీ విజయగర్వంతో గూండాయిజానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. రహమత్‌నగర్‌లో తమ పార్టీ కార్యకర్త రాకేశ్‌ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని రహమత్ నగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్త రాకేశ్‌పై శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను శనివారం కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫలితాలు వచ్చి 24 గంటలు దాటక ముందే కాంగ్రెస్ గూండాయిజం చేస్తోందన్నారు. తాము అనేక ఎన్నికల్లో గెలిచామని, ఎప్పుడు దాడులు చేయలేదన్నారు.
KTR | కార్యకర్తలను కాపాడుకుంటాం
విజయగర్వంతోనే కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఊరేగింపు నిర్వహించారని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. దొంగ ఓట్లు, గూండాగిరి, డబ్బులు పంచి ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. కాంగ్రెస్ విజయోత్సవ ఊరేగింపుతోనే ఎవరిది అహంకారమో తేలిపోయిందన్నారు. గతంలో తాము అనేక ఉప ఎన్నికల్లో గెలిచామన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాలేదన్నారు. అందుకని ఆ పార్టీ గుర్తును గాడిద మీద వేసి ఊరేగించామా అని ప్రశ్నించారు. తమ కార్యకర్తల మీద దాడి చేసిన వారిని వదిలిపెట్టమని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ దాడి ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
