అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | కాంగ్రెస్ పార్టీ దేశంతో పాటు రైతుల ప్రయోజనాలను తుంగలో తొక్కిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విమర్శించారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తన ప్రతిష్ట పెంచుకోవడం కోసం రాజీ పడ్డారని, సింధూ జలాలను (Sindu Water) పాకిస్తాన్‌కు అప్పగించారని ధ్వజమెత్తారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను (CP Radhakrishnan) సత్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ దేశానికి చేసిన ద్రోహంపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలకు పిలుపునిచ్చారు.
PM Modi | సింధూ జలాలు పాక్‌కు అప్పగింత
పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపి వేయడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోందని మోదీ మండిపడ్డారు. నెహ్రూ తన ప్రతిష్టను పెంచుకోవడానికి భారత ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. మంత్రివర్గాన్ని, పార్లమెంటును పరిగణనలోకి తీసుకోకుండానే ఒప్పందానికి ఆమోదం తెలిపారన్నారు.
మాజీ ప్రధాని, అప్పటి జనసంఘ్ ఎంపీ అటల్ బిహారీ వాజ్‌పేయితో సహా పార్లమెంటేరియన్లు నిరసన వ్యక్తం చేసినప్పుడు నెహ్రూ దారుణంగా వ్యవహరించారని, కొన్ని బకెట్ల నీటి కోసం ఎందుకు కేకలు వేస్తున్నారని ప్రశ్నించారన్నారు. అంతేకాదు లడక్‌లోని భారత భూభాగాన్ని చైనా (China) ఆక్రమించడాన్ని కూడా నెహ్రూ తక్కువ చేసి మాట్లాడారని, ఆ ప్రాంతంలో గడ్డి కూడా మొలవదన్నారని గుర్తు చేశారు. తొలి ప్రధాని నెహ్రూ దేశానికి చేసిన ద్రోహంతో పాటు, ఒప్పందంతో రైతులకు జరిగిన నష్టాన్ని తీర్చడానికి తమ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
PM Modi | రాధాకృష్ణన్‌తో అనుబంధం
ఎన్డీయే (NDA) ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తమది నాలుగు దశాబ్దాల అనుబంధమని, జనసంఘ్, బీజేపీలోకి రాకముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా పని చేశామని చెప్పారు. 40 ఏళ్ల పాటు ప్రజా సేవకే అంకితమయ్యారన్నారు. క్రీడలంటే ఎంతో ఆసక్తి ఉన్న రాధాకృష్ణన్ రాజకీయాల్లో ఆటలు ఆడరని పేర్కొన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం జరుగుతోంది.
PM Modi | బలంగా ఆర్థిక వ్యవస్థ
భారత ఆర్థిక వ్యవస్థను (Indian economy) మృత ఆర్థిక వ్యవస్థ అన్న ట్రంప్ వ్యాఖ్యలను మోదీ పరోక్షంగా ప్రస్తావిస్తూ మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందన్నారు. భారతదేశం దీర్ఘకాలిక సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసిన ఎస్&పీ గ్లోబల్ రేటింగ్స్ నిర్ణయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది దేశ బలమైన ఆర్థిక వ్యవస్థను హైలైట్ చేస్తుందని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తాను ప్రకటించిన ఆర్థిక సంస్కరణలు, జీఎస్టీ (GST) రేట్ల సరళీకరణ నిర్ణయాలు పేదలకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో స్టాక్ మార్కెట్ కూడా దూసుకెళ్తోందన్నారు.
