అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kalvakuntla Kavitha | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బోగస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆరోపించారు. జాగృతి జనం బాటలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లా (Kamareddy district) నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మంజీర వాగు ముంపునకు గురైన రైతులను ఆమె పరామర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక రైతులు తమ సమస్యలను కవితకు ఏకరువు పెట్టారు. వర్షాలు కురుస్తున్న సమయంలో బిక్కుబిక్కుమంటూ పాఠశాలల్లో తలదాచుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై స్పందించిన కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా ఆరు నుంచి ఏడు వేల వరకు పంట నష్టపోయిన రైతులను గుర్తించలేదన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
Kalvakuntla Kavitha | పంట నష్టపరిహారం ఇవ్వాలి
వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు (Farmers) ఎకరాకు రూ. 25వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా నేటికీ మరమ్మతులు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తీవ్ర జాప్యం కారణంగా రైతులు రోడ్లపై పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం రాశులు రోడ్ల వెంట దర్శనమిస్తున్నాయని, వెంటనే ధాన్యం కొనుగోల్లు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఎకరాకు 500 రూపాయల బోనస్ ను ఇవ్వాలని కోరారు. ఆటో డ్రైవర్లకు సైతం రూ.12 వేలు అందించి అందుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
