అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kalvakuntla Kavitha | బీసీ రిజర్వేషన్ల (BC reservations) పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై యుద్ధం చేస్తే తప్పా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రావని ఆమె అన్నారు.
హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ (Congress party) జెండా గద్దెలను కూల్చివేయాలని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో (panchayat elections) బీసీలకు 23 శాతం రిజర్వేషన్ కూడా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్‌రిజర్వ్ అయిన అన్ని సర్పంచ్ స్థానాల్లో (sarpanch seats) బీసీలు పోటీ చేయాలని ఆమె సూచించారు.
Kalvakuntla Kavitha | బీఆర్ఎస్ ఏం చేస్తోంది
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లోపించిందన్నారు. మొక్కుబడిగా బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుందని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాగే బీజేపీ సైతం బీసీలకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ప్రభుత్వం మోసం చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్ గురించి మాట్లాడితే బద్నాం చేస్తారని వ్యాఖ్యానించారు. కానీ బీసీ రిజర్వేషన్ల కోసం ఆ పార్టీ చేసిందేమి లేదన్నారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జాగృతి జనంబాట కార్యక్రమంలో (Jagruti Janambata program) మార్పులు చేసినట్లు కవిత తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనం బాట చేపడుతామన్నారు.