అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికపై కాంగ్రెస్ (Congress) ఫోకస్ పెట్టింది. ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా కార్పొరేషన్ ఛైర్మన్లకు నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను అప్పగించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పనిచేయాలని మొత్తం 19 మంది కార్పొరేషన్ ఛైర్మన్లకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించింది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinanh) జూన్ 8న మృతి చెందారు. బీఆర్ఎస్ (BRS) నుంచి గెలుపొందిన ఆయన మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక రానుంది. ఆరు నెలలలోపు ఎన్నికల సంఘం ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహించనుంది. దీంతో ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
Jubilee Hills | నగరంలో పట్టు కోసం..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే హైదరాబాద్ మహా నగరం పరిధిలో మాత్రం కాంగ్రెస్ సీట్లు గెలుచుకోలేకపోయింది. ఎంఐఎం ఏడు, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందగా.. కాంగ్రెస్ నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి (Malreddy Rangareddy) మాత్రమే విజయం సాధించారు. మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. అయితే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలుపొంది నగరంలో పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇది కీలకంగా మారుతుందని పార్టీ యోచిస్తోంది.
Jubilee Hills | టికెట్ కోసం ప్రయత్నాలు
అధికార కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ టికెట్ కోసం తీవ్ర పోటీ ఉంది. చాలా మంది అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసి అజారుద్దీన్ (Ajaruddin) ఓడిపోయారు. అప్పటి నుంచి తాను నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నానని, తనకే టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. స్థానిక నేతలకే టికెట్ ఇస్తామని మంత్రి పొన్నం ఇప్పటికే స్పష్టం చేశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. అయితే అభ్యర్థి ఎవరనేది మాత్రం అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.
పొన్నం వ్యాఖ్యలపై -కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఆయన నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన కూడా ఆసక్తి చూపుతున్నారు. వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక లోకల్ అభ్యర్థులా అని ఆయన ప్రశ్నించారు. అభ్యర్థిని ప్రకటించడానికి పెద్ద ప్రాసెస్ ఉంటుందని, హైకమాండ్ షార్ట్ లిస్ట్ చేస్తుందని తెలిపారు. టికెట్ కోసం పలువురు నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
Jubilee Hills | ఎన్నిక అప్పుడే..
మాగంటి గోపినాథ్ జూన్ 8న మృతి చెందారు. ఆరు నెలల్లోపు ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల (Bihar Election) సమయంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.