అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(Jubilee Hills by Election) గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో పలుమార్లు పర్యటించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే(Jubilee Hills MLA)గా బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మాగంటి గోపినాథ్ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. బీహార్ ఎలక్షన్లతో పాటు జూబ్లీ హిల్స్ స్థానానికి సైతం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ స్థానంలో గెలుపు కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Jubilee Hills | సీఎం సమావేశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్(PCC Cheif Mahesh Kumar Goud), మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించనున్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరండంగా భావించే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ నాయకులు ఈ స్థానంలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.
Jubilee Hills | అభ్యర్థి ఎవరో?
హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఇప్పటికే పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించారు. స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అయితే ఈ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. గతంలో మాజీ ఎంపీ అజారుద్దీన్ పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. అయితే కాంగ్రెస్ ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపీక చేసింది. దీంతో జూబ్లీహిల్స్ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపుతారనే ఉత్కంఠ నెలకొంది.
Jubilee Hills | బీజేపీ, బీఆర్ఎస్ సైతం
తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్(BRS) భావిస్తోంది. మాగంటి గోపినాథ్ చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. ఇటీవల ఆయన నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. మరోవైపు బీజేపీ సైతం ఈ సీటు గెలుచుకొని నగరంలో పట్టు పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్(Hyderabad) పరిధిలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఉన్న ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు. గతంలో నగరంలో మంచి పట్టున్న బీజేపీకి ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం గమనార్హం. దీంతో జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కమలం పార్టీ యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటించారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.