అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panchayat elections | రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా.. సర్పంచ్ ఫలితాలు చాలా గ్రామాల్లో వెలువడ్డాయి. అయితే మూడో విడతలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది.
మూడో దశలో మొత్తం 3,752 సర్పంచ్ (sarpanch), 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 6 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 1105 స్థానాలో, బీఆర్ఎస్ 492 చోట్ల, బీజేపీ 95, ఇతరులు 234 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Panchayat elections | శ్రేణుల్లో ఉత్సాహం
పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నేరుగా పార్టీ గుర్తులతో జరగకున్నా.. పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడానికి అనేక చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు గ్రామాల్లో ప్రచారం చేశారు. తమ అనుచరులను గెలిపించాలని కోరారు. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వానాకాలం సాగు చేసిన వడ్లకు బోనస్ డబ్బులు సైతం సకాలంలో చెల్లించింది. పంచాయతీ ఎన్నికల కోడ్ పడకముందే చాలా గ్రామాల్లో అధికారులు హడావుడిగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీ మెజారిటీ సర్పంచ్, వార్డు స్థానాలను కైవసం చేసుకుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమను గెలిపించాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
Panchayat elections | ప్రతిపక్షాలకు చెంపపెట్టు
మూడో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించడంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ స్పందించారు. పల్లెలు మరోసారి కాంగ్రెస్‌కు పట్టంకట్టాయన్నారు. ఈ తీర్పు కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు అన్నారు. ఇది గ్రామీణ రాజకీయాల్లో మార్పునకు సంకేతమని ఆయన పేర్కొన్నారు.