అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | కాంగ్రెస్ పార్టీ (Congress party) మైనార్టీలను దారుణంగా మోసగించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మైనార్టీ డిక్లరేషన్ (minority declaration) పేరిట అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ (Hyderabad) శివారులోని శంషాబాద్లో సోమవారం జరిగిన బీఆర్ఎస్ మైనార్టీ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెద్ద పెద్ద లీడర్లను తీసుకొచ్చి మైనార్టీ డిక్లరేషన్ (Congress minority declaration) ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మార్పు తెస్తామని గొప్పలు చెప్పి, చివరకు రెండేళ్ల పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. మైనార్టీల కోసం రూ.4వేల కోట్ల బడ్జెట్ పెడతామన్నారని.. మైనార్టీ సబ్ ప్లాన్ కూడా తెస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేసిన కేటీఆర్.. రెండేళ్లలో ఏ ఒక్కటైనా చేశారా? అని ప్రశ్నించారు. మిగిలిన మూడేళ్లలో కూడా వీళ్లు చేసేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు.
KTR | ఓటుబ్యాంకుగా చూస్తున్న కాంగ్రెస్
మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగానే చూస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ లేరన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలోనైనా ఒక్క మైనార్టీ లీడర్ను కూడా ఎన్నుకోలేదని దుయ్యబట్టారు. షబ్బీర్ అలీ, అజారుద్దీన్ లాంటి వారు కూడా కాంగ్రెస్కు కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. కానీ, బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ (BRS party and KCR) మాత్రం మైనార్టీల అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. షాదీ ముబారక్ పథకం ద్వారా ముస్లిం మహిళల పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారన్నారు.
మైనార్టీ స్కూళ్లను కేసీఆర్ ప్రారంభించారని.. ఎంతో మందికి నాణ్యమైన విద్య అందించారన్నారు. తాము కూడా కొన్ని కొన్ని పొరపాట్లు చేసి ఉంటే చేసుండొచ్చని, కానీ.. ఇండియాలో మైనార్టీలకు కేసీఆర్ చేసినన్ని పనులు ఇంకెవరూ చేయలేదన్నారు. తెలంగాణలో 45 లక్షల మంది ముస్లింలు ఉన్నారని.. కేసీఆర్ హయాంలో ఒక్కొక్కరిపై రూ.5వేల ఖర్చు చేశారని. మిగతా ఏ రాష్ట్రంలోనూ ఇంత ఖర్చు చేయలేదన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం అత్యధికంగా ఖర్చు చేసింది కేసీఆరేనని అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కూడా ఇతర రాష్ట్రాల్లో చెప్పారు.. కానీ ఇక్కడ చెప్పరని మండిపడ్డారు.
KTR | బీజేపీకి మద్దతుగా రేవంత్..
కాంగ్రెస్ నాయకత్వం బీజేపీ మీద పోరాడుతుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీజేపీతో కలిసి పని చేస్తారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని.. కాంగ్రెస్-బీజేపీ కలిసి నడిపిస్తున్న ప్రభుత్వమన్నారు. రేవంత్ రెడ్డి బంధువుకు కేంద్రంలో కాంట్రాక్టులు ఇస్తే, దానికి బదులుగా రేవంత్ కూడా బీజేపీ నేతలకు లాభం చేకూరుస్తారని ఆరోపించారు. మోదీ తెచ్చిన చట్టాలను బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాలకంటే తొందరగా ఇక్కడ రేవంత్ అమలు చేస్తారని విమర్శించారు.. హైడ్రా గురించి రాహుల్ గాంధీ సైలెంట్గా ఉంటారని కేటీఆర్ ప్రశ్నించారు. బుల్డోజర్ రాజ్యం నడవదని యూపీపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారని.. ఇక్కడ అదే బుల్డోజర్ రాజ్యం నడుస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్గా ఉన్నారని నిలదీశారు.
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు మోదీ జేబు నింపే సంస్థలని రాహుల్ గాంధీ విమర్శిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం కేసు (Kaleshwaram case) సీబీఐకి అప్పగిస్తారని వ్యాఖ్యానించారు. తాను మోదీ స్కూల్లో చదివానని.. చంద్రబాబు కాలేజీకి వెళ్లానని.. రాహుల్ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారని గుర్తు చేశారు. చౌకీదార్ చోర్ అని రాహుల్ అంటే.. రేవంత్ రెడ్డి కాదు కాదు.. ఆయన నా పెద్దన్న అని చెబుతున్నాడన్నారు. నోట్లు లెక్కపెట్టే మెషిన్లను లోపలికి తీసుకెళ్లిన దృశ్యాలు అంతా చూశారని, అంత జరిగిన తర్వాత ఏమైంది.. ఏమీ కాలేదు.. అంతా సైలెంట్ అంటూ విమర్శించారు.

