అక్షరటుడే, వెబ్‌డెస్క్: Agriculture Minister | రాష్ట్రంలో ఎరువుల కొరతపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సరిపడా యూరియా ఇవ్వడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) ఆదివారం ఆరోపించగా, రాష్ట్రానికి యూరియా కేటాయింపులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు (Ramachandra Rao) సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత కోటా కంటే ఎక్కువగానే యూరియాను అందించిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాక కేంద్రంపై నిందలు మోపుతున్నదని విమర్శించారు.
Agriculture Minister | కోటా ఇవ్వడం లేదు..
కేంద్ర ప్రభుత్వం (Central Government) రాష్ట్రానికి నిర్దేశిత కోటా ప్రకారం యూరియా సరఫరా చేయడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. యూరియా సరఫరాపై ఫిబ్రవరి నుంచి కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని, అయినా స్పందన లేదన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడం కలెక్టరేట్‌లో (Bhadradri Kothaguda Collectorate) జిల్లా అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా కొరతపై స్పందించారు. 9.8 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా వచ్చిందని, జూన్ కోటాకు సంబంధించి ఇంకా 42 శాతం లోటు ఉందని తుమ్మల వివరించారు. ఎరువుల సరఫరాపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం ప్రకటనలకు, సరఫరాకు చాలా తేడా ఉందని చెప్పారు. యూరియా కొరతపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్‌కి (Bandi Sanjay) లేఖ రాశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నం చేసేందుకు రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని కోరారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు చొరవ తీసుకుని యూరియా తెప్పించాలని సూచించారు.
Agriculture Minister | రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం..
యూరియా సరఫరాపై (Urea Supply) రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఖండించారు. ప్రభుత్వానికి చేతకాక కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆదివారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూస్తోందని, కానీ, తెలంగాణలోనే ఎందుకు కొరత వస్తోందని ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్రాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎరువుల కొరతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.