అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anjan Kumar Yadav | జూబ్లీహిల్స్ (Jubilee Hills) టికెట్ ఆశించి భంగపడిన పార్టీ నేతలను కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగించే పనిలో పడింది. ఈ మేరకు మాజీ ఎంపీ, సీనియర్ నేత అంజన్‌కుమార్ యాదవ్‌తో పార్టీ కీలక నేతలు శుక్రవారం సమావేశమయ్యారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తదితరులు అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్లారు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ అంజన్‌తో సమావేశమయ్యారు. పార్టీ టికెట్ కేటాయించకపోవడంపై అలక బూనిన ఆయనను పార్టీ నేతలు బుజ్జగించారు. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు వస్తాయని సర్దిచెప్పారు. కాంగ్రెస్ పార్టీకి (Congress Party) చేసిన సేవలను అంజన్ గుర్తు చేయగా, తమకన్నీ విషయాలు తెలుసని చెప్పారు.
Anjan Kumar Yadav | కలిసి పని చేయాలి..
సర్వేలు, ఇతర నివేదికల ఆధారంగా నవీన్ యాదవ్‌కు హైకమాండ్ టికెట్ కేటాయించిందని మీనాక్షి నటరాజన్ అంజన్‌తో చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ గెలుపు కోసం అందరం కష్టపడి పని చేయాలని ఆమె సూచించారు. ఉప ఎన్నికలో విజయం ఎంత కీలకమో వివరిస్తూ, కలిసి పని చేద్దామని కోరారు. కాంగ్రెస్ పార్టీ కోసం సుదీర్ఘంగా పని చేస్తున్న మీకు తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయని ఆమె హామీ ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు, పొన్నం (Ponnam Prabhakar), వివేక్ కూడా అంజన్‌కుమార్ యాదవ్‌ను బుజ్జగించారు. ఎలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న సీనియర్లకు కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు.
Anjan Kumar Yadav | రుసరుసలాడిన మాజీ ఎంపీ..
అంతకు ముందు తనను కలిసిన మంత్రులతో అంజన్ కుమార్ యాదవ్ రుసరుసలాడారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం కష్డపడి పని చేస్తుంటే గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు. అభ్యర్థి ఎంపికలో తనను సంప్రదించరా..? లోకల్, నాన్ లోకల్ సమస్య ఇప్పుడే ఎందుకొచ్చింది..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా..? అని నిలదీశారు. భవిష్యత్తు కార్యాచరణపై తన అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అయితే, పార్టీ ఇన్‌ఛార్జి, మంత్రులు సర్దిచెప్పడంతో అంజన్ కాస్త మెత్తబడ్డారు.