KTR
KTR | కాళేశ్వరంపై కాంగ్రెస్​, బీజేపీ కుట్ర చేశాయి.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)​పై కాంగ్రెస్​, బీజేపీ రాజకీయ కుట్ర చేశాయని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్​ నగరంలోని ఉప్పల్ (Uppal)​లో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సులో ఆయన మాట్లాడారు.

అధికారం కోసం కాంగ్రెస్​ గడ్డి కూడా తింటుందని కేటీఆర్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)లో కూడా కాంగ్రెస్ (Congress) ఏదో చేసిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రెండు పిల్లర్లు కుంగినప్పుడు ఏదో పెద్ద శబ్దం వచ్చిందని అక్కడున్న రైతులు చెప్పారన్నారు. ఎన్నికల్లో గెలవలేక కుట్రలు చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.

KTR | బీఆర్​ఎస్​ ఏ పార్టీలో విలీనం కాదు

ఏపీకి చెందిన బీజేపీ (BJP) ఎంపీ సీఎం రమేశ్​ (CM Ramesh)కు కేటీఆర్​ కౌంటర్​ ఇచ్చారు. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్‌ఎస్‌ ఏ పార్టీలో విలీనం కాదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్​రెడ్డి, ఎంపీ సీఎం రమేశ్​ మధ్య రహస్య ఒప్పందాన్ని బయట పెట్టడంతోనే పార్టీ విలీనం అంటూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని విమర్శించారు. ఇరకాటంలో పడ్డ ప్రతిసారీ కాంగ్రెస్‌, బీజేపీ ప్రజల దృష్టిమరల్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

KTR | త్వరలో కొత్త అధ్యక్షుడు

బీఆర్​ఎస్​వీ (BRSV) రాష్ట్ర అధ్యక్షుడిగా త్వరలో కొత్త వారిని ఎన్నుకుందామని కేటీఆర్​ అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్​యాదవ్​కు ప్రమోషన్​ ఇచ్చి.. చాకు లాంటి వ్యక్తిని నూతన అధ్యక్షుడిగా ఎంపిక చేస్తామన్నారు. భవిష్యత్తు తెలంగాణ యువకులదని ఆయన అన్నారు. ఇప్పుడు ఎవరైతే విద్యార్థి వీరులు, నాయకులు నడుము బిగిస్తారో.. వాళ్లే తెలంగాణ తల రాత మార్చే నాయకులుగా ఎదుగుతారని చెప్పారు.

KTR | వాళ్ల పేరు రాసిపెట్టుకోండి

గెల్లు శ్రీనివాస్ భార్య మీద అటెమ్ట్ మర్డర్ కేసు పెడతారా అని కేటీఆర్​ ప్రశ్నించారు. ఎగిరి పడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసి పెట్టుకోండని కార్యకర్తలకు సూచించారు. అధికారంలోకి వచ్చాక వారి లెక్కలు మిత్తితో సహా తేలుస్తామన్నారు. బీఆర్​ఎస్​వీ కార్యకర్తలు సోషల్​ మీడియాలో పోరాటం చేయాలని సూచించారు.