అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vote Chori | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మాతృమూర్తిని కించపరిచిన వివాదం చెలరేగిన కొద్ది రోజులకే మరోసారి వారిని అవమానించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది.
మోదీ ఓట్ల చోరీకి పాల్పడుతుంటే, ఆయన తల్లి మందలిస్తున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) సాయంతో రూపొందించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ (Congress Party) బీహార్ విభాగం ఎక్స్‌లో పోస్టు చేసింది. వీడియాలో ఎవరి పేరును ప్రస్తావించక పోయినప్పటికీ, మోదీ, ఆయన మాతృమూర్తిని పోలికలతోనే తీర్చిదిద్దారు. అయితే, కాంగ్రెస్ తీరుపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. విపక్ష పార్టీ అన్ని హద్దులు దాటేసిందని విమర్శించింది. అసహ్యకరమైన చర్యలకు దిగజారిందని, బీహార్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని పేర్కొంది.
Vote Chori | ఓట్ల చోరీ చేశారని..
బీహార్ కాంగ్రెస్ ‘X’లో ప్రధాని మోదీ (PM Modi), ఆయన తల్లితో కూడిన AI రూపొందించిన వీడియోను పోస్ట్ చేసింది. “”మా” సాహబ్ కలలలో కనిపిస్తుంది. ఆసక్తికరమైన సంభాషణ చూడండని” హిందీలో క్యాప్షన్‌తో షేర్ చేసింది, ఆ క్లిప్‌లో ప్రధానమంత్రి తన తల్లి తన రాజకీయాలపై తనను తిడుతున్నట్లు కలలు కంటున్నట్లు చూపించింది. ప్రధాని మోదీ రూపంలో ఉండే వ్యక్తి రాత్రి ఇంటికి వచ్చి.. ఈ రోజు ఓట్ల చోరీతో ముగించాను. ఇక ప్రశాంతంగా నిద్రపోతా అని చెబుతాడు. నిద్రకు ఉపక్రమించిన ఆయనకు కలలో ఆయన తల్లి వచ్చి మందలిస్తుంది. ఓట్ల కోసం రాజకీయాల్లో తన పేరును ఎందుకు ఉపయోగిస్తున్నావని తిడుతుంది. “రాజకీయాల విషయానికి వస్తే నువ్వు ఎంతవరకు దిగజారి పోవడానికి సిద్ధంగా ఉన్నావు?” అని ప్రశ్నిస్తుంది. ఆ వెంటనే సదరు వ్యక్తి ఆశ్చర్యపోయి మేల్కొంటున్న వీడియోను కాంగ్రెస్ పోస్టు చేసింది.
Vote Chori | కాంగ్రెస్ పై బీజేపీ నిప్పులు..
విపక్ష కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులు దాటిందని, మరింత దిగజారిపోయిందని బీజేపీ (BJP) నిప్పులు చెరిగింది. బీహార్ కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియోపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా (Shehzad Poonawalla) తీవ్రంగా స్పందించారు. జీవించి లేని వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ అసహ్యకరమైన రాజకీయాలకు మండిపడ్డారు. గతంలో మోదీ మాతృమూర్తిని కించపరిచిన ఘటనపై పశ్చాత్తాపం తెలపడానికి బదులు మరింత గతంలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు.
“ప్రధాని తల్లిని కించపరిచినందుకు పశ్చాత్తాపం చెందకుండా ఇంకా సమర్థించుకోవడానికి యత్నిస్తోంది. ఇప్పుడు బీహార్ కాంగ్రెస్ (Bihar Congress) ఒక అసహ్యకరమైన వీడియోతో అన్ని హద్దులను దాటింది. చనిపోయిన వ్యక్తిని కూడా రాజకీయాల్లోకి లాక్కొస్తుండడం సిగ్గుచేటు” అని షెహజాద్ పూనవాలా ‘X’లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని తల్లిని అవమానించడం కొనసాగిస్తోందని, మహిళలను ఎగతాళి చేస్తున్న కాంగ్రెస్, ఆర్జేడీలకు బీహార్ ప్రజలు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.