Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | బీసీ వెల్ఫేర్ అధికారిగా ఎంపిక కావడం అభినందనీయం

SP Rajesh Chandra | బీసీ వెల్ఫేర్ అధికారిగా ఎంపిక కావడం అభినందనీయం

అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | రామారెడ్డి ఎస్సై (Rama Reddy SI) లావణ్య గ్రూప్-1 ద్వారా బీసీ వెల్ఫేర్ అధికారిగా ఎంపిక కావడం అభినందనీయమని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎస్సై లావణ్య ఎస్పీని కలవగా ఆమెను ఎస్పీ సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. ఎస్సై లావణ్య ఎక్సైజ్ కానిస్టేబుల్‌ నుంచి గ్రూప్-1లో జిల్లా అధికారిగా నియామకం కావడం గొప్ప విషయమన్నారు. కష్టపడితే ఫలితం వస్తుందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. రామారెడ్డి ఎస్సై లావణ్య 2018లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారని, 2020లో సివిల్ ఎస్సైగా, 2025లో గ్రూప్–1లో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి (BC Welfare Officer) పోస్టును సాధించడం ద్వారా అసాధారణ ప్రతిభను చాటుకున్నారని తెలిపారు.

సిద్దిపేట జిల్లా (Siddipet District) చేబర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి ట్రిపుల్ ఐటీ బాసరలో సీటు సాధించి ఆసక్తితో విద్యను అభ్యసించారన్నారు. పోలీస్ ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు, ఆటుపోట్లు, సమయ పరిమితులను అధిగమిస్తూ, లభించిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని గ్రూప్–1 ఉద్యోగాన్ని సాధించడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో ప్రొబెషనరీ పూర్తి చేసిన అనంతరం నస్రుల్లాబాద్ రామారెడ్డి ఎస్సైగా విధులు నిర్వహించారని తెలిపారు. పోలీసు విధులలో ఎలాంటి రిమార్కులు లేకుండా అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారన్నారు. భవిష్యత్తులో కూడా తన ప్రతిభతో మంచి పేరు సంపాదించి, ప్రజలకు సేవ చేస్తూ తనదైన ముద్ర వేసుకోవాలని ఆకాంక్షించారు.