HomeజాతీయంTejaswi Yadav | ఆర్జేడీ టికెట్ల పంపిణీపై గంద‌ర‌గోళం.. టికెట్లు తిరిగి ఇచ్చేయాల‌న్న‌ తేజ‌స్వి

Tejaswi Yadav | ఆర్జేడీ టికెట్ల పంపిణీపై గంద‌ర‌గోళం.. టికెట్లు తిరిగి ఇచ్చేయాల‌న్న‌ తేజ‌స్వి

బీహార్ ఎన్నిక‌ల వేళ ఆర్జేడీలో గంద‌ర‌గోళం నెల‌కొంది. అభ్య‌ర్థుల‌కు పంపిణీ చేసిన టికెట్లను తిరిగి వెన‌క్కి ఇవ్వాల‌ని తేజస్వి యాదవ్ కోరడం క‌ల‌క‌లం రేపింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tejaswi Yadav | బీహార్ ఎన్నిక‌ల వేళ రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ పార్టీలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. అభ్య‌ర్థుల‌కు పంపిణీ చేసిన టికెట్లను తిరిగి వెన‌క్కి ఇవ్వాల‌ని కోర‌డంతో పార్టీలో క‌ల‌క‌లం రేపింది.

మ‌హాఘ‌ట్ బంధ‌న్ కూట‌మిలో సీట్ల పంపిణీ ఖ‌రారు కాక ముందే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ టికెట్లు పంపిణీ చేయ‌డం కూట‌మిలో విభేదాల‌కు తావిచ్చింది. మిత్ర పార్టీల నుంచి తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డంతో పాటు క‌నీస స‌మాచారం ఇవ్వ‌కుండా టికెట్లు కేటాయించ‌డంపై తేజ‌స్వి యాద‌వ్(Tejaswi Yadav) క‌ల‌త చెందారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న టికెట్లు పొందిన అభ్య‌ర్థులు వాటిని తిరిగి ఇచ్చేయాల‌ని పిలుపునిచ్చారు.

Tejaswi Yadav | వెన‌క్కి ఇచ్చేయండి..

సోమవారం ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన త‌ర్వాత ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాద‌వ్ (Lalu Prasad Yadav) చాలా మంది అభ్యర్థులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌తో పాటు జేడీయూ నుంచి వ‌చ్చిన వారికి సైతం టికెట్లు కేటాయించారు. అయితే, ఈ వ్య‌వ‌హారంపై లాలూ కుమారుడు తేజ‌స్వి తీవ్ర క‌ల‌త చెందారు. ఇండియా బ్లాక్ ఇంకా అధికారికంగా సీట్ల పంపకాల ఫార్ములాను ప్రకటించలేదని ఎత్తి చూపారు. దీంతో టికెట్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపి వేశారు. పార్టీ టికెట్లు పొందిన వారు తిరిగి ఇవ్వాల‌ని తేజస్వి యాదవ్ మంగ‌ళ‌వారం కోరారు.

Tejaswi Yadav | చిక్కుల్లో ఆర్జేడీ..

కీల‌క‌మైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) వేళ ఆర్జేడీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఇబ్బందిక‌రంగా మారాయి. ఐఆర్‌సీటీసీ కుంభ‌కోణం కేసులో పార్టీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌, ఆయ‌న భార్య ర‌బ్రీదేవి, కుమారుడు తేజ‌స్వి యాద‌వ్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమ‌వారం ప‌లు అభియోగాలు మోపింది. అసెంబ్లీ ఎన్నిక‌ల ముంద‌ర ఆర్జేడీ(RJD)కి ఇది తీవ్ర ఇబ్బందిక‌రంగా మారింది. మ‌రోవైపు, కూట‌మి పార్టీల మ‌ధ్య సీట్ల పంపకాలు తేల‌క ముందే లాలూ అభ్య‌ర్థులకు టికెట్లు కేటాయించారు. ఇది కూట‌మిలో తీవ్ర విభేదాల‌కు దారి తీసింది. సీట్ల పంప‌కాల‌పై చ‌ర్చ‌లు తుది ద‌శ‌కు చేరుకుంటున్న త‌రుణంలో లాలూ చేసిన ప‌నిపై కుమారుడు తేజ‌స్వి తీవ్రంగా నొచ్చుకున్నారు. టికెట్లు వెన‌క్కి ఇచ్చేయాల‌ని ఆయ‌న అభ్య‌ర్థుల‌ను కోరారు.

Tejaswi Yadav | తేల‌ని సీట్ల పంచాయితీ..

సీట్ల పంపకాల ఫార్ములాపై చివరి నిమిషంలో తలెత్తిన విభేదాలను పరిష్కరించడానికి తేజస్వి యాదవ్, ప్రతిపక్ష కూటమికి చెందిన పలువురు అగ్ర నాయకులతో కలిసి సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో స‌మావేశ‌మ‌య్ఆయ‌రు. 70 సీట్లు కేటాయించాల‌ని కాంగ్రెస్ ప‌ట్టుబ‌ట్ట‌డంతో చర్చలు అసంపూర్తిగా మిగిలిపోయాయి.