అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRS | బీఆర్ఎస్‌లో తలెత్తిన అంతర్గత సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. కేసీఆర్ (KCR family) కుటుంబంలో తలెత్తిన ఆధిపత్య పోరు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
అదే సమయంలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అంశం ఆ పార్టీలో ఇప్పుడు గందరగోళానికి దారి తీసింది. ఈ విషయంలో ఎలా స్పందించాలో, ఎటు వైపు నిలవాలో తెలియక పార్టీ క్యాడర్‌లో భారీ కన్ఫ్యూజన్ నెలకొంది. బీఆర్ఎస్‌లో నెలకొన్న ఆధిపత్య పోరును నివారించడానికి గులాబీ బాస్ కేసీఆర్ ప్రయత్నాలు చేయక పోవడం, మరోవైపు పార్టీ నాయకత్వం నుంచి సరైన స్పష్టత లేకపోవడంతో ఏం చేయాలో తెలియక నాయకులు, కార్యకర్తలు మధనపడుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు(BRS Leaders), ఎమ్మెల్సీ కవిత అనుచరుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
BRS | ఎవరు ఎటువైపు..?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్(BRS)కు మంచి పట్టుంది. మొన్నటి ఎన్నికలను మినహాయిస్తే ఇప్పటికీ బలంగా ఉంది. రెండు జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాల్లోనూ బలమైన కేడర్ బీఆర్ఎస్ సొంతం. ఇందులో కవితకు అంటూ ప్రత్యేకంగా వర్గం ఉంది. అన్ని నియోజకవర్గాల్లోనూ ఆమెకు అనుచరులు ఉన్నారు. అయితే, కుటుంబంలో ఆధిపత్య పోరు కారణంగా ఎమ్మెల్సీ కవిత తిరుగుబావుట ఎగుర వేసిన నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో కలకలం రేగింది.
ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం తర్వాత ఎవరు ఎటువైపు అన్నది తెలియక కొత్త గందరగోళం నెలకొంది. ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే వంటి బలమైన నేతలు ఉన్నారు. ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బిగాల వంటి వారు కేసీఆర్‌తో పాటు కేటీఆర్(KTR)తో అత్యంత సన్నిహితంగా ఉంటారు. అదే సమయంలో జిల్లాకు వచ్చే సరికి కవితతోనూ సఖ్యతతో మెలుగుతారు. బాజిరెడ్డి, గంప గోవర్ధన్ వంటి వారి రూట్ కాస్త సెపరేట్. జాజాల, షిండే వంటి వారు అందరితో కలిసి ఉంటారు. అయితే, పార్టీలో రెండు వర్గాలు ఏర్పడిన ప్రస్తుత తరుణంలో ఎవరు ఎటువైపు ఉంటారన్నది చర్చనీయాంశమైంది.
BRS | మెట్టింట మద్దతు దొరికేనా!
తీవ్ర అసంతృప్తితో ఉన్న కవిత.. అన్నింటికీ సిద్దపడే తిరుగుబావుట జెండా ఎగురవేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే బీఆర్ఎస్‌ను వీడి కొత్త పార్టీ కూడా పెట్టేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆమెకంటూ ఉన్న ప్రత్యేక వర్గం కవిత వెంట నడుస్తుందా? లేక కేటీఆర్‌కు జైకొడుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కవిత తీసుకున్న నిర్ణయానికి మెట్టినింట మద్దతు దొరుకుతుందా? ఆమె నిర్ణయాన్ని అత్తింటి వారు సమర్థిస్తారా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కవిత(MLC Kavitha) తీసుకునే పొలిటకల్ నిర్ణయానికి కవిత భర్త అనిల్ మద్దతుగా నిలుస్తారా? అన్నది కూడా కీలకమే. కవిత మామ రాంకిషన్‌రావు క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆయన మదిలో ఏముందన్నది కూడా చర్చనీయాంశమైంది.
BRS | వెంట నడిచేదెవరు..?
ఉమ్మడి జిల్లాలో కవితకు ప్రత్యేక వర్గం ఉంది. తెలంగాణ జాగృతి(Telangana Jagruti)తో పాటు బీఆర్ఎస్‌కు చెందిన కొంత మంది నాయకుల నుంచి ఆమెకు బలమైన మద్దతుంది. అయితే, ప్రస్తుత సంక్షోభంలో ఆమె వెంట వారంతా నడుస్తారా? లేక కేసీఆర్(KCR), కేటీఆర్(రామన్న)(KTR) తీసుకునే నిర్ణయానికి కట్టుబడతారా? అన్నది ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కవితక్క మా అక్క అని చెప్పుకునే జీవన్‌రెడ్డి(Jeevan Reddy) కేసీఆర్‌ను విడిచి రాలేరన్నది ఖాయం..! ఇక, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి (Prashanth Reddy) కూడా కేసీఆర్, కేటీఆర్‌లను దూరం చేసుకుని కవిత వెంట నడుస్తారన్నది అనుమానమే. బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి, షకీల్, షిండే, జాజాల సురేందర్ వంటి వారు కూడా కేసీఆర్‌ను వీడడం సందేహమే. ముఖ్యంగా రామన్నను కాదని వారు ఏ పనీ చేయరని ప్రచారంలో ఉంది. బలమైన నాయకత్వమంతా పార్టీ వెంట నడిస్తే.. కవిత వెంట నడిచేదెవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.