అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills by-Election | రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన జూబ్లీహిల్స్ సమరం ముగిసింది. ఓటర్ తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈ నెల 14న ఫలితం వెల్లడి కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్నాయి.
అయితే, కాంగ్రెస్ పార్టీ (Congress Party) జోష్‌లో నెలకొనగా, బీఆర్ఎస్‌లో మాత్రం కలవరం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలే అందుకు కారణం. సర్వేలన్నీ అధికార పార్టీ గెలుస్తుందని స్పష్టంగా తేల్చి చెప్పాయి. ఉప ఎన్నికలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిపత్యం చాటుకుందని స్పష్టం చేశాయి. బీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ, పోల్ మేనేజ్‌మెంట్‌లో వెనుకబడడంతో రెండో స్థానానికి పరిమితమవుతుందని వెల్లడించాయి. తొలి నుంచి అందరూ భావిస్తున్నట్లే బీజేపీ (BJP) మూడో స్థానానికే పరిమతం కానుందని పేర్కొన్నాయి.
Jubilee Hills by-Election | లెక్కల్లో మునిగి తేలిన పార్టీలు..
దాదాపు నెల రోజులుగా ప్రచారంలో బిజీబిజీగా గడిపిన ప్రధాన పార్టీల నేతలు ఓట్ల లెక్కలపై దృష్టి సారించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-Election)లో ఈసారి కూడా సగం కంటే తక్కువగా ఓటింగ్ జరిగింది. 48.47 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47.58 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి దాదాపు ఒక్క శాతం మాత్రమే పెరిగింది. దీంతో ఎవరికి ఎన్ని ఓట్లు వేస్తాయనే లెక్కల్లో అభ్యర్థులు మునిగి తేలారు. ఏయే డివిజన్లలో తమకు ఎన్ని ఓట్లు వస్తాయో లెక్కగడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పోలింగ్ జరిగిన తీరుతో పాటు ఓటర్ల మనోగతాన్ని తెలుసుకుని లెక్కలు వేసుకుంటున్నాయి. వీటి ఆధారంగా గెలుపు ఓటములపై అంచనాకు వస్తున్నాయి.
Jubilee Hills by-Election | నిస్తేజంలో బీఆర్ ఎస్..
ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ (Congress)లో సరికొత్త జోష్‌ను నింపాయి. అధికార పార్టీ గెలుస్తుందని అన్ని సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో అధికార పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ నైరాశ్యం అలుముకుంది. అందరి కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన గులాబీ పార్టీ.. ప్రచారంలోనూ దూసుకెళ్లింది. తొలినాళ్లలో కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) ఉధృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ, ఎన్నిక గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు ప్రతికూలంగా మారాయి. ప్రధానంగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై ఆయన కన్నతల్లి అనుమానాలు వ్యక్తం చేయడం, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై పలు ఆరోపణలు రావడం ఇబ్బందికరంగా మారింది.
అదే సమయంలో కేటీఆర్‌పై అనేక ఆరోపణలు రావడంతో బీఆర్ఎస్ సరైన కౌంటర్ ఇవ్వలేక సందిగ్ధంలో పడిపోయింది. మరోవైపు, పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం గులాబీ పార్టీకి మైనస్‌గా మారింది. ఇప్పటికీ ప్రజల్లో ఆయనపై ప్రత్యేక అభిమానం ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఓటమి తర్వాత ఆయన బయటకు రావడం లేదు. ఒకవేళ కేసీఆర్ ప్రచారం చేసి ఉంటే పార్టీకి ఎంతో మేలు కలిగేది. కానీ ఆయన రాలేదు. ఇక, పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ బీఆర్ఎస్ (BRS) వెనుకబడింది. కేవలం మీడియా, సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకున్న కేటీఆర్.. పోల్ మేనేజ్‌మెంట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేక పోయింది. ఇలా అనేక కారణాల వల్ల ఆ పార్టీకి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి.
