అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa Prajavani | చెరువులు, ప్రభుత్వ భూముల (government lands) రక్షణకు హైడ్రా చర్యలు చేపడుతోంది. దీంతో ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదులు చేస్తున్నారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి 37 ఫిర్యాదులు అందాయి.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా (Medchal-Malkajgiri district) అల్వాల్ కొత్త చెరువు ఆక్రమణలకు గురవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ పరిశ్రమతో పాటు.. పలు అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పసుమాముల గ్రామంలోని కృష్ణా నగర్ లే ఔట్లోకి పక్కనే ఉన్నవారు 50 అడుగుల మేర జరిగారని కృష్ణనగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీంతో 41 ప్లాట్ల హద్దులు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 25 అడుగుల రహదారి కూడా మాయమైందన్నారు.
Hydraa Prajavani | పార్క్ కబ్జా
సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని విజయ విహార్ ఎన్క్లేవ్ లే ఔట్ (Vijay Vihar Enclave layout) ప్రకారం రహదారితో పాటు.. పిల్లలు ఆడుకునే పార్కు స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు అందింది. నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి మండలం చందానగర్ పోలీసు స్టేషన్ దగ్గరలోని గంగారాం చెరువు నుంచి అమీన్పూర్ చెరువుకు వెళ్లాల్సిన వరద కాలువ కబ్జాకు గురి అవుతున్నట్లు సీపీఐ(ఎం) పార్టీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
ఎల్బీనగర్ మున్సిపాలిటీ హస్తినాపురంలోని వెంకటేశ్వర కాలనీ ఫేజ్ -2లో 1200 గజాల స్థలాన్ని బస్టాండ్ కోసం కేటాయించారని కాలనీ ప్రతినిధులు తెలిపారు. అయితే బయట వారు వచ్చి ఈ భూమిని కబ్జా చేశారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.