అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల్లో ఆశావహులు పోటీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఇటీవల బలోపేతం అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ఎమ్మెల్యేగా ధన్‌పాల్ సూర్యానారాయణగుప్తా, ఆర్మూర్ నుంచి రాకేశ్‌రెడ్డి గెలుపొందారు. అనంతరం అర్వింద్ ఎంపీగా విజయం సాధించారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) సైతం జిల్లాలో బీజేపీ మెరుగైన ఓట్లు సాధించింది. పార్టీ బలోపేతం కావడంతో స్థానిక ఎన్నికల్లో సీట్లకు సైతం పోటీ పెరిగింది.
Local Body Elections | నేతల దగ్గర ప్రయత్నాలు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని పలువురు మంత్రులు ప్రకటించారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. అనంతరం మున్సిపల్ ఎన్నికలు సైతం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో బీజేపీలో (BJP) టికెట్ల కోసం పలువురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ నియోజకవర్గ నేతల వద్దకు వెళ్లి టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. పలువురు నేతలు సైతం తమ అనుచరులకు టికెట్ విషయంలో హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Local Body Elections | రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయం మేరకే..
బీజేపీలో పలువురు నేతలు తమ అనుచరులకు టికెట్ల విషయంలో హామీ ఇచ్చినట్లు అధిష్టానానికి తెలిసింది. దీంతో రాష్ట్ర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బీజేపీలో వ్యక్తిగతంగా నాయకులు టికెట్లు కేటాయించే సంస్కృతి లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. జిల్లా కోర్ కమిటీ (District Core Committee) ఆశావహుల జాబితా తయారు చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయం మేరకు టికెట్లు కేటాయిస్తామని రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా నాయకులకు సమాచారం అందజేశారు. సొంతంగా ఎవరికీ టికెట్ విషయంలో హామీ ఇవ్వొద్దని హెచ్చరించారు.