Harish Rao
Harish Rao | నెల రోజులైనా ప‌రిహారం రాలే.. సిగాచి బాధితుల‌ను ఆదుకోవాల‌న్న హ‌రీశ్‌రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | సిగాచి ప‌రిశ్ర‌మ‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగి నెల రోజులు దాటినా ఇంత వ‌ర‌కు ఏ ఒక్క‌రికి ప‌రిహారం ఎందుకు ఇవ్వ‌లేద‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు(Former Minister Harish Rao) ప్ర‌శ్నించారు. నెల గడిచినా ఎంత మంది చనిపోయారు, ఎంత మంది క్షతగాత్రులయ్యార‌ని ఇప్ప‌టికీ ఎందుకు అధికారికంగా వెల్లడించలేదన్నారు.

చనిపోయిన వారి పేర్లు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, క్షతగాత్రులకు ఎంత ఇచ్చారు అనేది ఈ ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతున్నదని ప్ర‌శ్నించారు. సిగాచి కంపెనీ ప్రమాద బాధితులతో క‌లిసి హ‌రీశ్‌రావు సోమ‌వారం సంగారెడ్డి అడిషన్ కలెక్టర్​ను (Sangareddy Additional Collector) క‌లిశారు. సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నా డెడ్ బాడీలు అప్పగించడంలో, పరిహారం అందించడంలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వచ్చి కోటి రూపాయల ఎక్స్​గ్రేషియా ప్రకటించారని, నెల దాటినా ఒక్కరికి ప‌రిహారం అందలేదని విమ‌ర్శించారు. అంతిమ కార్యక్రమాలు జరిపేందుకు మృతదేహాలు కూడా ఇవ్వని దుస్థితి నెల‌కొంద‌ని, చివ‌ర‌కు బూడిదను తీసుకువెళ్లి గోదావరిలో కలుపుకున్నమని బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు.

Harish Rao | స‌ర్కారుది బాధ్య‌తారాహిత్యం

ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ‌(Telangana)లో ఇంత దారుణమైన ప్రమాద ఘటన జరగలేదని, 54 మంది చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా బాధ్యతారాహిత్యంగా ఉంద‌ని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. ఎక్స్ గ్రేషియా, డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారని బాధితులు అడిగితే.. ఎస్‌ఎల్‌బీసీ ప్ర‌మాదంలో మృతదేహాలు కూడా దొరకలేదు, మీకు బూడిదైనా దొరికిందా అని అత్యంత అమానవీయంగా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. ఏపీ, బిహార్, జార్ఖండ్, యూపీ నుంచి రావాలంటే, ఉండాలంటే 20, 30 వేలు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు బాధపడుతున్నారన్నారు.

Harish Rao | ప‌రిహారం ఇవ్వ‌లే..

ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు వ‌చ్చిన ముఖ్య‌మంత్రి.. మృతుల‌కు కోటి ఇస్తామని మాటిచ్చారని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ప‌రిహారం ఎప్పుడు ఇస్తారు, ఎవరు ఇస్తారు అని అడిగితే ఎవరూ చెప్పడం లేదని అంటున్నారని విమ‌ర్శించారు. చాలా మంది ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.10 లక్షలు ఇస్తామని సీఎం చెబితే, రూ.50వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50లక్షలు ఇచ్చి, నెలనెలా వేతనం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు నష్టపరిహారం వివరాలు వెల్లడించకుండా ఎందుకు గోప్యంగా ఉంచారో సమాధానం చెప్పాలన్నారు.

Harish Rao | యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం..

సిగాచి కంపెనీలో (Sigachi Company) పాత మిషన్ వల్ల ప్రమాదం జ‌రిగి ఉండొచ్చ‌ని చనిపోయిన జగన్మోహన్ కొడుకు యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌మాదం జరిగే అవకాశం ఉందని అనేక సార్లు కార్మికులు చెప్పినా, కంపెనీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగినా వారిపై ఎందుకు కేసు పెట్టలేదని నిల‌దీశారు. రేవంత్‌రెడ్డి యాజ‌మాన్యాన్ని కాపాడుతున్నార‌ని ఆరోపించారు. ఎందుకు యాజమాన్యంతో కుమ్మక్కు అయ్యావు, కంపెనీతో ఉన్న లాలూచీ ఏమిటో బ‌య‌ట పెట్టాల‌న్నారు. మృతదేహాలు ఇవ్వకుండా 8 మంది మిస్సింగ్ అంటూ ఎందుకు వేధిస్తున్నారని, వెంటనే డెత్ సర్టిఫికేట్(Death Certificate) ఇచ్చి, ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప‌రిహారం ఎవరు ఇస్తారు, ప్రభుత్వమా, కంపెనీనా అని మీడియా వారు అడిగితే ఎవరు ఇస్తే ఏందని ఆరోజు సీఎం దబాయించిండు. కంపెనీ కూడా 15 రోజుల్లో పరిహారం ఇస్తామని పత్రికా ప్రకటన ఇచ్చింది. ఇప్పటికీ దిక్కులేదని తెలిపారు.

Harish Rao | వ‌ల‌స కార్మికుల అంగా బీఆర్ఎస్ ..

కరోనా సమయంలో వలస కార్మికులకు బీఆర్ఎస్ అండ‌గా నిల‌బ‌డింద‌ని, అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ (Former CM KCR) అక్కున చేర్చుకున్నార‌ని హరీశ్‌రావు తెలిపారు. సీఎస్‌కు బాధ్యతలు అప్పగించి జార్ఖండ్, యూపీ, బిహార్ వంటి సొంత రాష్ట్రాలకు రైళ్లలో పంపించాడని గుర్తు చేశారు. వలస కార్మికులు తెలంగాణ అభివృద్దిలో భాగస్వాములు అని వారికి ఎంతో గౌరవం ఇచ్చారన్నారు. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం మృతదేహాలను నూనె డబ్బాల్లో ప్యాక్ చేసి ఇచ్చిండన్నారు.

ప్ర‌మాదం ఎలా జ‌రిగింది, ఎంత మంది చ‌నిపోయారన్న‌ది ఎందుకు చెప్ప‌డం లేద‌ని హరీశ్​రావు ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం వేసిన క‌మిటీ రిపోర్టు ఏమైంద‌ని నిల‌దీశారు. గతంలో ఇలాంటి ప్రమాదమే సంగారెడ్డిలో జరిగితే వారం రోజుల్లో రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా, సర్టిఫికెట్లు ఇంటికి వెళ్లి ఇచ్చిమ‌న్నారు. రేవంత్‌రెడ్డికి ఢిల్లీకి వెళ్లి రావ‌డం త‌ప్ప మ‌రో ప‌ని లేద‌ని విమ‌ర్శించారు. ఎస్ఎల్​బీసీ ఘటన జరిగి 150 రోజులు అయినా శవాలు బయటికి రావడం లేదని, చనిపోయారో, బతికి ఉన్నారో తెలియదన్నారు. ప్ర‌భుత్వంపై మాట్లాడితే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జైళ్లలో పెడతావు.. 54 మంది ప్రాణాలు బలితీసుకున్న కంపెనీపై మాత్రం కేసు పెట్ట‌వా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం(State Government) స్పందించకుంటే బీఆర్ఎస్ తరపున పోరాటం తీవ్రతరం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.