అక్షరటుడే, ఎల్లారెడ్డి: Harish Rao | వరద బాధితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కామారెడ్డి (Kamareddy), ఎల్లారెడ్డి ప్రాంతాలను ఆదివారం ఆయన సందర్శించారు. బాధిత రైతులతో మాట్లాడారు.
Harish Rao | వేల ఎకరాల్లో పంట నష్టం..
పంటనష్టం వివరాలను రైతుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారీ వరదల కారణంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో 40,000 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. కామారెడ్డి పట్టణంలోనూ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం వచ్చి వరద ప్రాంతాలను సందర్శించినా ఏమీ ఉపయోగం లేదన్నారు.
Harish Rao | నెలరోజులైనా రైతు గోస పట్టదా..?
సీఎం క్షేత్రస్థాయిలో పర్యటించి నెలరోజులు దాటినప్పటికీ రైతులకు నష్టపరిహారం అందకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం నష్టపరిహారం అందిస్తామని ప్రకటించినా ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.
Harish Rao | అధికారుల లెక్కల్లోనే రూ. 344 కోట్లు..
పంటనష్టంపై ఇప్పటికే రూ. 344 కోట్లు నష్టం జరిగిందని అధికారులు నివేదికలు పంపినా.. సీఎం రేవంత్రెడ్డి రూ. 34 కూడా ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు. కామారెడ్డి నియోజకవర్గం ఇప్పటికీ వరద నష్టం నుంచి కోలుకోలేదని ఆయన పేర్కొన్నారు.
Harish Rao | ఇన్ఛార్జి మంత్రి ఉన్నట్టా.. లేనట్టా..
భారీ వర్షాలతో రోడ్లు ధ్వంసమై ఎల్లారెడ్డి నియోజకవర్గ నుండి కామారెడ్డి జిల్లా కేంద్రానికి రవాణా స్తంభించిందని హరీష్ రావు అన్నారు. పోచారం కాలువను మరమ్మతులు చేయించాలని.. గండ్లను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు. జిల్లాకు ఒక మంత్రి పదవి ఇవ్వలేదు.. ఉన్న ఇన్ఛార్జి మంత్రి ఒక్కరూపాయి ఇవ్వలేదని విమర్శించారు.
Harish Rao | అసెంబ్లీలో సమస్యను లేవనెత్తుతాం..
బాధిత రైతులకు నష్టపరిహారం అంశాన్ని అసెంబ్లీలో (Telangana Assembly) చర్చకు తీసుకొస్తామని హరీష్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈపాటికి రైతుల గోస విని నష్టపరిహారం ప్రకటించేవాడని పేర్కొన్నారు. హరీష్ రావు వెంట ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి(MLA Prashanth Reddy), మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.