అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం కంటే.. ప్రభుత్వాలను కూల్చడానికి పనికి వస్తారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు.
కమ్యూనిస్ట్లు అధికారం కోసం కాకుండా సిద్ధాంతాల కోసం పనిచేస్తారన్నారు. అందు కోసమే అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉండడానికి ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో వారి పాత్ర కీలమన్నారు. తెలంగాణలో అధికార మార్పు విషయంలో కూడా కమ్యూనిస్ట్లు సహకరించారని చెప్పారు.
CM Revanth Reddy | చరిత్రలో నిలిచిపోయేలా..
సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోయేలా నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలిలో చర్చిస్తామన్నారు. మహనీయుల పేర్లు రాష్ట్రంలో శాశ్వతంగా నిలవాలన్నారు. అందుకే తెలుగు విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి (Suravaram Pratap Reddy) పేరు, మహిళా విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టామని రేవంత్రెడ్డి అన్నారు.
CM Revanth Reddy | వన్నె తెచ్చారు
ఒక ప్రాంతం నుంచి సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఆ ప్రాంత వాసులకు గర్వంగా ఉంటుందని ఆయన అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణా రావు, జైపాల్ రెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాకు వన్నె తెచ్చారని చెప్పారు. వారెప్పుడు సమాజంలో గౌరవం పొందుతూనే ఉంటారన్నారు. సుధాకర్ రెడ్డి గౌరవం శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.