అక్షరటుడే, ఇందూరు: CPM Nizamabad | తెలంగాణ సాయిధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ముబారక్ నగర్లోని (Mubaraknagar) బీడీ కంపెనీలో మంగళవారం తెలంగాణ రైతాంగ పోరాట విషయాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదన్నారు. నిజాం నవాబుకు (Nizam Nawab) తాబేదారులుగా ఉన్న దొరలు, భూస్వాములు, పటేల్ పట్వారీలు, జాగీర్దారులు, జమీందార్లు పేదలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ దౌర్జన్యం చేశారన్నారు.
ప్రజల్లో తిరుగుబాటు వచ్చి కమ్యూనిస్టుల నాయకత్వంలో సంఘాలను ఏర్పాటు చేసుకొని కులమతాలకు అతీతంగా దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. మూడువేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేశారన్నారు.
పోరాటంలో 2,500 మంది పేదలు, కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇంతటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంటే దాన్ని వక్రీకరణ చేస్తున్న బీజేపీ విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, నాయకులు సాయిలు, మోహన్, ఖాదర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.