అక్షరటుడే, వెబ్డెస్క్ : Indigo | ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏ చర్యలు చేపట్టాయి. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆ సంస్థ కార్యకలాపాలను నిశితంగా పరిశీలించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం ఎనిమిది మంది సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల (Indigo Flights) రద్దుతో ప్రయాణికులు 8 రోజులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నట్లు ఇండిగో ప్రకటించింది. అయితే ఈ సంక్షోభంపై విచారణకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కమిటీని సైతం ఏర్పాటు చేసింది. డిమాండ్ ఉన్న రూట్లలో మార్పులు చేస్తోంది. ఇప్పటికే ఇండిగోకు చెందిన 10 శాతం సర్వీసులను తగ్గించింది.
Indigo | ఇండిగో కార్యాలయంలో..
కమిటీలోని ఇద్దరు అధికారులు ఇండిగో కార్పొరేట్ ప్రధాన కార్యాలయంలో ఉంచి రోజువారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. వేలాది రద్దులు, ఆలస్యాలకు కారణమైన సంక్షోభం పెరుగుతున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ చర్యలు చేపట్టింది. ఇండిగో సేవల అంతరాయం ప్రయాణీకుల రద్దీకి కారణమవుతూనే ఉండటంతో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా విమానాశ్రయ కార్యకలాపాలను క్షుణ్ణంగా మూల్యాంకనం చేయడం ప్రారంభించింది. సీనియర్ అధికారులను కీలక విమానాశ్రయాలకు పంపినట్లు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఇండిగో సంక్షోభం దేశ పర్యాటక రంగంపై పడింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో పర్యాటకులు తగ్గారు. బుక్ చేసుకున్న విమానాలు రద్దవడంతో పర్యాటకుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. 50-60 శాతం పర్యాటకుల సంఖ్య తగ్గినట్లు ఆయా రాష్ట్రాలు చెబుతున్నాయి.