అక్షరటుడే, వెబ్డెస్క్ : Engineering Colleges | ఇంజినీరింగ్ (Engineering), ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు ప్రభుత్వం కమిటీ వేసింది. రాష్ట్రంలో మూడేళ్లకు ఒకసారి ఫీజుల పెంపునకు అనుమతి ఇవ్వాలని పలు కాలేజీలు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఇటీవల పలు కాలేజీలు తాము ఫీజులు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టు (High Court)ను ఆశ్రయించాయి. అయితే వారి పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు ఆరు వారాల్లోగా కాలేజీల ఫీజులు నిర్ణయించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఫీజులు నిర్ణయించడానికి కమిటీ వేసింది.
Engineering Colleges | కమిటీ సభ్యులు వీరే..
తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGHEC) ఛైర్మన్ బాలకిష్టారెడ్డిని ఫీజుల నిర్ధారణ కమిటీ ఛైర్మన్గా ప్రభుత్వం నియమించింది. సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన, ఎసీడీడీ కమిషన్, డైరెక్టర్ ఎన్ క్షితిజ, డీటీసీపీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, టీజీసీహెచ్ఈ సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్, హైదరాబాద్ జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ఓయూ డీన్ క్రిష్ణయ్య ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
Engineering Colleges | 2025–28 కాలానికి..
రాష్ట్రంలో 2022లో ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల ఫీజులను పెంచారు. తాజాగా 2025–28 వరకు ఫీజులను నిర్ణయించడానికి కమిటీని వేశారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయనుంది. అలాగే ఆయా కాలేజీల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. అనంతరం ఫీజుల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.