అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rohith Vemula | రాష్ట్రంలో 8 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి (Hyderabad Central University Student) రోహిత్ వేముల 2016లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే రోహిత్ ఆత్మహత్యకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల నియామకం అయిన రామచందర్‌రావే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై రాంచందర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా డిప్యూటీ సీఎంకు లీగల్ నోటీసులు పంపారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని.. లేదంటే రూ.25 లక్షల పరువు నష్టం దావా వేస్తానన్నారు.
Rohith Vemula | భట్టి ఏమన్నారంటే..
రాష్ట్రంలో రోహిత్ వేముల (Rohith Vemula) ఆత్మహత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయనను యూనివర్సిటీ సస్పెండ్ చేయడంతో 2016 జనవరి 7న ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అప్పటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ (Union Minister Bandaru Dattatreya) మానవవనరుల శాఖ మంత్రికి లేఖ రాయడంతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విపక్షాలు ఆరోపించాయి.
ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఇటీవల దీనిపై మాట్లాడుతూ భట్టి విక్రమార్క రోహిత్ ఆత్మహత్యకు రామచందర్‌రావే (Ramachandra Rao) కారణమని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల విద్యార్థిని వేధించి ఆత్మహత్యకు ఉసిగొల్పిన వ్యక్తికి పదవి కట్టాబెట్టారన్నారు.
Rohith Vemula | రోహిత్ వేముల చట్టం తెస్తాం..
గతంలో కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) రోహిత్ వేముల ఆత్మహత్య గురించి పట్టించుకోలేదని భట్టి అన్నారు. తమ ప్రభుత్వం ఈ కేసుపై సమగ్రంగా విచారణ జరుపుతుందన్నారు. విచారణ ప్రక్రియను పున: ప్రారంభిస్తామని చెప్పారు. మళ్లీ ఏ దళిత, ఆదివాసీ విద్యార్థికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం తీసుకు వస్తామని భట్టి విక్రమార్క అన్నారు.