అక్షరటుడే, వెబ్డెస్క్: Jaishankar | రష్యాకు చెందిన సంస్థలు భారతదేశంతో మరిన్ని వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పిలుపునిచ్చారు. రష్యా నుంచి చమురు కొంటుందన్న కారణంతో ఇండియాపై అమెరికా 50 శాతం సుంకాలను విధించిన నేపథ్యంలో జైశంకర్ రష్యన్ కంపెనీలను (Russian Companies) ఆహ్వానించడం గమనార్హం.
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని. ‘మేక్ ఇన్ ఇండియా’ (Make in India) వంటి కార్యక్రమాలు కొత్త అవకాశాలను తెరిచాయని ఆయన పేర్కొన్నారు. రష్యాలోని మాస్కోలో జరిగిన ఇండియా-రష్యా బిజినెస్ ఫోరం కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “‘మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు విదేశీ వ్యాపార సంస్థలకు కొత్త దారులు తెరిచాయి.
Jaishankar | ప్రభుత్వ ప్రోత్సాహం..
ఇండియా(India)లో జరుగుతున్న ఆధునీకరణ, పట్టణీకరణ కారణంగా జీవన శైలిలో మార్పుల వల్ల వినియోగం, ఇతర డిమాండ్లు పెరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో వ్యాపార, వాణిజ్య రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని, రష్యన్ కంపెనీలు మరింత చురుగ్గా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆయా రంగాలలో రష్యన్ కంపెనీలు భారతీయ సంస్థలతో కలిసి మరింత ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి వారిని ప్రోత్సహించడమే తమ ప్రయత్నమని తెలిపారు. ఇండియా రష్యా మధ్య సంబంధం ప్రస్తుత కాలంలో ‘స్థిరమైన సంబంధాలలో’ ఒకటిగా పెంపొందిందని జైశంకర్(Jaishankar) గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Jaishankar | వాణిజ్య లోటు పూడ్చుకోవాలి..
ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య లోటును పూడ్చుకోవాల్సి ఉందని జైశంకర్ తెలిపారు. “వాణిజ్య వైవిధ్యీకరణ సమతుల్యత రెండూ ఇప్పుడు అత్యవసరంగా మన వైపు నుంచి మరింత కఠినమైన ప్రయత్నాలను తప్పనిసరి చేస్తాయి. చివరికి, అధిక వాణిజ్య లక్ష్యాలను చేరుకోవడానికి మాత్రమే కాకుండా ప్రస్తుత స్థాయిలను నిలబెట్టుకోవడానికి కూడా అవి చాలా అవసరం” అని ఆయన పేర్కొన్నారు.