అక్షరటుడే, ఇందూరు : Fee Reimbursement | ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 3 నుంచి కళాశాలలను బంద్ చేయనున్నట్లు తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాల యాజమాన్య అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి (Jaipal Reddy), నరాల సుధాకర్ తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరికి శనివారం బంద్కు సంబంధించిన వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రీయింబర్స్ మెంట్ పెండింగ్లో ఉండడం వల్ల కళాశాలల (Colleges) మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇప్పటికే అధ్యాపకులకు నెలసరి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. గత మూడేళ్ల నుంచి బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టమైపోయిందని వాపోయారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి నివేదిక అందించినా స్పందించడం లేదన్నారు. రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకు నిరవధిక బంద్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వినతిపత్రం అందించిన వారిలో కళాశాలల యాజమానులు మారయ్య గౌడ్, శంకర్, గురువేందర్ రెడ్డి, సూర్య ప్రకాష్, శ్రీనివాస్, అరుణ్, గిరి, దత్తు, అనిల్, షకీల్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.
