అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kothugudem Collector | ప్రభుత్వ ఆస్పత్రుల్లో(Govt Hospitals) వైద్యం చేయించుకోవడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. దీనికి కారణం అక్కడ వైద్యులు అందుబాటులో ఉండరు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉండటమే. అప్పొ సొప్పో చేసి మరీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపెట్టుకుంటారు. ప్రభుత్వ దవాఖానాకు పోవాలంటే భయపడుతుంటారు..!
ప్రభుత్వం మాత్రం సర్కార్ దవాఖానాల కోసం రూ.కోట్ల నిధులు విడుదల చేస్తోంది. అన్ని రకాల వసతులు కల్పిస్తోంది. ఇటువంటి తరుణంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందితే ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల మీద నమ్మకం పెరుగుతుంది. తాజాగా కొత్తగూడెం కలెక్టర్ (Kothagudem Collector) జితేష్ వి పాటిల్(Jitesh V Patil) తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచారు.
కలెక్టర్ జితేశ్ వి పాటిల్ భార్య శ్రద్ధకు పురిటి నొప్పులు రావడంతో బుధవారం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రి(Palvanch CHC)కి తీసుకొచ్చారు. ఆమెకు వైద్యులు కాన్పు చేయగా.. పండంటి మగ బిడ్డ పుట్టాడు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు. కాగా.. కొన్ని నెలలుగా కలెక్టర్ తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే చూపెట్టడం గమనార్హం. ప్రభుత్వ ఆస్పత్రిలో భార్యకు కాన్పు చేయించిన కలెక్టర్‌ను పలువురు అభినందిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha) సైతం కలెక్టర్‌ను అభినందించారు. కాగా.. జితేష్ వి పాటిల్ గతంలో కామారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు.
గతంలో పెద్దపల్లి కలెక్టర్ (peddapalli collector) కోయ శ్రీహర్ష( ias sri harsha) ప్రభుత్వ ఆస్పత్రిలో తన భార్యకు ప్రసవం చేయించారు. గోదావరిఖని (Godavarikhani) ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తన భార్యకు డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచారు. ఇలా అధికారులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి ఆదర్శంగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.