అక్షరటుడే, ఇందూరు : Nizamabad Collector | ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కేంద్రంతో పాటు బోధన్(Bodhan), వర్ని(Varni) మండలం జలాల్పూర్ ప్రాంతాల్లో పర్యటించారు. జలాల్పూర్ వద్ద లోలెవెల్ వంతెన(Lowlevel Bridge)పై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జలాల్పూర్ – బడాపహాడ్ మార్గంలో రాకపోకలను నిలిపి వేయించాలని అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దారి మళ్లించాలని తెలిపారు. చెరువులు, కాల్వలు, గుంటలు, వాగుల్లోకి ఎవరు కూడా చేపల వేటకు, ఈత కోసం వెళ్లకుండా కట్టడి చేయాలని ఆదేశించారు. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరికలు చేసినందున అధికారులు పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు.
జిల్లా కేంద్రంలోని బోధన్ రోడ్డు స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీలను పరిశీలించారు. అలాగే బోధన్ పట్టణంలోని షర్బతీ కెనాల్, సరస్వతి నగర్ ప్రాంతాల్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో(Bodhan Sub-Collector Vikas Mahato), ఏసీపీ శ్రీనివాస్, నిజామాబాద్ మున్సిపల్ ఈఈ మురళీమోహన్ రెడ్డి తదితరులున్నారు.
Nizamabad Collector | కంట్రోల్ రూం పరిశీలన
జిల్లా కలెక్టరేట్లో కొనసాగుతున్న కంట్రోల్ రూంను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) శనివారం తనిఖీ చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఏవైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూం ఫోన్ నెంబర్ 08462 220183కు సమాచారం అందించాలని సూచించారు.