అక్షరటుడే, ఇందల్వాయి: Collector Nizamabad | మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్, సిబ్బందితో భూభారతి (Bhubarathi), స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(Special Intensive Revision) పూర్వ ప్రక్రియ అమలుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మాడ్యుల్స్‌లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు.. ఎంతమందికి నోటీసులు ఇచ్చారు.. క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు.
దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదాబైనామా(SadabaiNama), పీఓటీలకు సంబంధించిన అప్లికేషన్‌లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటవెంటనే నోటీసులు జారీ చేస్తూ, క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలన్నారు.
భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలన పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.
అలాగే ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్వ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయా కేటగిరీల వారీగా మ్యాపింగ్ నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించి, బీఎల్‌వో సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలకు సూచనలు చేశారు. తహశీల్దార్ వెంకట్ రావు ఉన్నారు.

