అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్‌లో ఉన్న సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌ను (Central Drugs Store) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీడీడీఎస్ రికార్డుల్లో పొందుపర్చిన వివరాలకు అనుగుణంగా ఔషధ నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు.
జిల్లాలోని వివిధ పీహెచ్‌సీలకు వాటిని ఎలా చేరవేస్తారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇండెంట్ వచ్చిన వెంటనే తాత్సారం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఔషధాలను చేరవేయాలని, ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫార్మసిస్ట్ గంగాధర్‌ను (Pharmacist Gangadhar) ఆదేశించారు.
ఆస్పత్రుల వ్యర్థాలను నిబంధనలకు అనుగుణంగా సరైన విధానంలో డిస్పోస్ చేయాలని.. అలా చేయని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులను ఆదేశించారు. జక్రాన్ పల్లి మండలం పడకల్ శివారులో మెడికేర్ సర్వీసెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ వేస్టేజీని (Medical Waste) నిర్వీర్యం చేసే ప్లాంట్‌ను శుక్రవారం సందర్శించారు. ప్రతిరోజూ ఎన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వ్యర్థాలను సేకరిస్తున్నారు. వాటిని ఎలా నిర్వీర్యం చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో 900 వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కొనసాగుతుండగా సగానికి పైగా హాస్పిటళ్ల నుంచి నుంచి వ్యర్థాలను సేకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాలను సరిగ్గా సేకరించని కారణంగా ప్రైవేటు ఆస్పత్రుల వారు ఎక్కడబడితే అక్కడ పారవేస్తున్నారన్నారు. దీంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. ఏజెన్సీకి వ్యర్ధాలు అందించని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. అటువంటి ఆస్పత్రులను గుర్తించి అనుమతులను రద్దు చేయాలని డీఎంహెచ్‌వో రాజశ్రీని ఆదేశించారు.