అక్షరటుడే, ఇందూరు: Collector Ila Tripathi | నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఇలా త్రిపాఠి ఇప్పటి వరకు నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. కాగా, అంతుకు ముందే ఆమె ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇలా త్రిపాఠి రాసిన “71 టు 51- మై జర్నీ ప్రమ్ ఫెయిల్యూర్ టు ఐఏఎస్‘ (71 to 51 – My Journey from Failure to IAS) పుస్తకం అమెజాన్‌లో విపరీతంగా విక్రయించబడటం ద్వారా ఆమె ప్రపంచానికి సుపరిచితురాలయ్యారు.
మొదటి ప్రయత్నంగా సివిల్స్ ప్రిలిమ్స్ లో 71మార్కులకే పరిమితమైన ఆమె.. రెండో ప్రయత్నంలోనే 1054 మార్కులతో దేశంలోనే 51వ ర్యాంకు అందుకున్న జర్నీని ఇలా త్రిపాఠి తన రచనలో వివరించారు. అంటే మొదటిసారి చేసిన తప్పులు.. రెండో ప్రయత్నంలో వాటిని ఎలా అధిగమించానో వివరిస్తూ.. స్ఫూర్తిదాయక, ప్రేరణాత్మక రచన ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు.
ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె తన ప్రస్థానాన్ని వివరించారు. ఇలా త్రిపాఠి స్వస్థలం లఖ్‌నవూలోని అలీగంజ్. నాన్న పీఎన్ త్రిపాఠీ ఇండియన్ ఫారెస్టు సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఆఫీసర్‌గా పనిచేసి 2011లో గుండెపోటుతో మరణించారు. అమ్మ గిరిజా త్రిపాఠీ ప్రైవేట్ టీచర్. అక్క పేరు వినీత త్రిపాఠి. ఇలా ఢిల్లీలో ఇంజినీరింగ్ (2013) పూర్తి చేశారు. లండన్‌లో ఎంఎస్ (ఎకనామిక్స్) చేశారు. అనంతరం అక్కడే ఫైనాన్స్ కన్సల్టెంట్‌గా రెండున్నర సంవత్సరాలు పని చేశారు.
ఇలా త్రిపాఠి చిన్నప్పటి నుంచే కలెక్టర్ కావాలని భావించారు. ఇందుకు స్ఫూర్తి ఆమె నాన్న మాటలు. ఈ క్రమంలోనే లండన్ వదిలి 2015లో సివిల్స్ కు సన్నద్ధం అయ్యారు. 2016లో తొలిసారి సివిల్స్ రాశారు. కానీ, ప్రిలిమ్స్‌లో కూడా దాటలేకపోయారు. అయితే 2017లో రెండో ప్రయత్నంలోనే ఆల్ ఇండియా లెవల్లో 51వ ర్యాంకు అందుకున్నారు.
ముస్సోరీ(ఉత్తరాఖండ్ )లోని ‘లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’లో బ్యూరోక్రసీ పాఠాలు చదివారు. శిక్షణ ఐఏఎస్‌గా భద్రాద్రి కొత్తగూడెంలో విధులు నిర్వర్తించారు. అనంతరం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. తదుపరి ములుగు జిల్లా కలెక్టర్‌గా, పర్యటకశాఖ సంచాలకురాలిగా విధులు నిర్వర్తించారు.
ఇలా భర్త పేరు భవేశ్ మిశ్రా. ఆయన ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉప కార్యదర్శిగా విధులు పనిచేస్తున్నారు. బిహార్‌లోని బాగల్పూర్లో పనిచేస్తున్నప్పుడు ఏర్పడిన పరిచయం పెళ్లి పీటలు ఎక్కింది. ఇలా ప్రభుత్వాసుపత్రిలో పండంటి బాబుకి జన్మనిచ్చారు.
Collector Ila Tripathi | అంబాపిడర్ వాలీ నౌకరీ స్ఫూర్తి..
ఉత్తరప్రదేశ్‌లో అభిషేక్ ప్రకాశ్ అనే ఐఏఎస్ అధికారి ఎక్కువగా అంబాసిడర్ కారులో ప్రయాణించేవారు. అతని వస్త్రధారణ, హుందాతనం అందరినీ ఆకర్షించేది. ఆయన హోదా ఏమిటో స్థానికులకు తెలియక అందరూ ‘అంబాసిడర్ వాలీ నౌకరీ’ అని పిలిచేవారట. ఆయనను కూడా ఇలా త్రిపాఠి ఆదర్శంగా తీసుకున్నారట. సివిల్స్‌లో ర్యాంకు సాధించాక.. ‘లఖ్ నవూ కా టాపర్ అని అక్కడి పత్రికలో ఇలా త్రిపాఠి కథ ప్రచురితం అయిందట. ఇది ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇదే క్రమంలో తనలా సివిల్స్ సాధించాలనే వారితో తన అనుభవాలను పంచుకోవాలని భావించారు. తన ఈ సివిల్స్ ప్రిపరేషన్ నుంచి విజయం సాధించిన జర్నీని “71 టు 51- మై జర్నీ ఫ్రేమ్ ఫెయిల్యూర్ టు ఐఏఎస్’ అనే పేరుతో పుస్తకం తీసుకొచ్చారు.
ఇలా త్రిపాఠి రచించిన పుస్తకంలో జనరల్ స్టడీస్, మేనేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సమకాలీన అంశాలపై లోతైన విశ్లేషణలు నిక్షిప్తం చేశారు. అన్నట్లు ఇలా త్రిపాఠి సామాజిక మాధ్యమాల ద్వారానూ యాక్టివ్‌గా ఉంటారు. అడిగిన వారికి సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇలా త్రిపాఠి.. ఉత్తర తెలంగాణ ధాన్యాగారంగా పేరుగాంచిన ఇందూరు జిల్లాకు కలెక్టర్‌గా వస్తున్నారు. చూద్దాం.. మరి ఇక్కడ ఆమె పాలన, పరిపాలన, తనదైన ముద్ర ఏ విధంగా ఉండబోతుందో..