అక్షరటుడే, బోధన్: Collector Ila Tripathi | మున్సిపల్ ఎన్నికల వేళ విధి నిర్వహణలో తీరిక లేని విధంగా పనిఒత్తిడిలో ఉన్నప్పటికీ.. తనను కలిసేందుకు వచ్చిన విద్యార్థినులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆప్యాయంగా మాట్లాడారు. వారికి చాక్లెట్లు పంచిపెట్టారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (Government Junior College) కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.
Collector Ila Tripathi | కలెక్టర్‌ను కలిసిన విద్యార్థినులు..
కలెక్టర్ వచ్చిన విషయం తెలుసుకున్న సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (Government Girls’ High School) విద్యార్థినులు జిల్లా పాలనాధికారిని కలిసేందుకు కళాశాల వద్దకు చేరుకున్నారు. తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో వారిని గమనించిన కలెక్టర్, బాలికలను తన వద్దకు పిలిపించుకుని ఒక్కొక్కరితో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు. చక్కగా చదువుకోవాలని హితవు పలుకారు. వారికి చాక్లెట్లు అందించారు. జిల్లా పాలనాధికారిని నేరుగా కలిసిన క్షణాలను విద్యార్థినులు ఆస్వాదిస్తూ, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Collector Ila Tripathi | నామినేషన్ల కేంద్రాల పరిశీలన..
మున్సిపల్ ఎన్నికల (municipal election) నామినేషన్ల దాఖలు ప్రక్రియ చివరి రోజైన శుక్రవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు.
Collector Ila Tripathi | అదేవిధంగా నగరంలోని బడాబజార్‌లో..
నిజామాబాద్ నగరంలోని బడా బజార్ వాటర్ ట్యాంక్ మున్సిపల్ జోన్ ఆఫీస్‌ను సందర్శించి నామపత్రాల స్వీకరణ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. శుక్రవారం చివరిరోజు సాయంత్రం 5 గంటల్లోపు వచ్చిన వారికి నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. నామినేషన్లు అందించేందుకు స్వీకరణ కేంద్రం ఆవరణలో నిరీక్షిస్తున్న వారికి అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించి, తాగునీరు వంటి వసతులు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.
Collector Ila Tripathi | హెల్ప్‌డెస్క్.. వీడియోగ్రఫీ..
నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా అని తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు సమర్పించిన వారి వివరాలను పక్కాగా రిజిస్టర్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్ లను నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ, సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు.
Collector Ila Tripathi | అభ్యర్థులకు సహకారంపై ఆరా..
నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, పై అధికారులను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.
