అక్షరటుడే ఇందల్వాయి : Collector Nizamabad | ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ధర్పల్లి మండలం ఒన్నాజిపేట్లోని జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్, ఎరువుల గోడౌన్లను కలెక్టర్ సందర్శించారు.
ఇందల్వాయి మండలంలోని (Indalvai mandalam) ఎల్లారెడ్డిపల్లిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను, సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు. పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది హాజరును పేస్ రికగ్నేషన్ విధానం (Face Recognisation System) ద్వారా చేపడుతున్నారా అని ఆరా తీశారు. విద్యార్థుల ప్రవేశాలు, హాజరవుతున్న వారి సంఖ్యను కలెక్టర్ ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఎరువుల గిడ్డంగుల్లో అందుబాటులో ఉన్న నిల్వలు స్టాక్ రిజిస్టర్లోని వివరాలకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలించారు.
Collector Nizamabad | ఎరువులను అందుబాటులో ఉంచాలి
రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎరువుల వివరాలతో కూడిన స్టాక్బోర్డులను (Stockboard) ప్రతిచోటా తప్పనిసరిగా ప్రదర్శించాలని, శాశ్వత ప్రాతిపదికన బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నందున, ఎక్కడ కూడా ఎరువుల కోసం రైతులు (Farmers) ఇబ్బందులు పడకుండా ప్రణాళికాబద్ధంగా పంపిణీ జరిగేలా కృషి చేయాలని చెప్పారు.
Collector Nizamabad | ఒకేచోట అంగన్వాడీల నిర్వహణపై ఆరా..
ఎల్లారెడ్డిపల్లిలో (Yellareddypally) ఒకే ప్రాంగణంలో మూడు అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi Centers) కొనసాగుతుండడాన్ని గమనించిన కలెక్టర్.. ఎందుకు ఒకేచోట నిర్వహిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. గదులు ఒకేచోట అందుబాటులో ఉన్నందున ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. చిన్నారులను కేంద్రాలకు పంపేందుకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. పిల్లలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తూ, ఆటపాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని అంగన్వాడీ టీచర్ రజితను ఆదేశించారు. ఎల్లారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణాల ప్రగతి గురించి పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.