HomeUncategorizedMonsoon | చల్లని కబురు.. ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. ఈసారి భారీగానే వర్షాలు

Monsoon | చల్లని కబురు.. ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. ఈసారి భారీగానే వర్షాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Monsoon | గత రెండు నెలలుగా భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని తీపి కబురు అందించింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది.

దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను మంగళవారం మధ్యాహ్నం నాటికి నైరుతి రుతుపవనాలు తాకినట్లు ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల రాకతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.

రానున్న మూడు, నాలుగు రోజుల్లో అండమాన్‌ నికోబార్‌ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు రుతుపవనాలు విస్తరించనున్నట్లు ఐఎండీ తెలిపింది. మే 27 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

Monsoon | 2009 తర్వాత ఇదే మొదటిసారి..

సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 నాటికి భారత్​లోకి ప్రవేశిస్తాయి. ఈసారి మాత్రం అంతకంటే ముందుగానే కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ఇటీవల పేర్కొంది. అదే జరిగితే 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. మరోవైపు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మన దేశంలోని సాగుభూమిలో 52 శాతం వర్షాధారంగా రైతులు పంటలు పండిస్తారు. మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచే ఏకంగా 40% దిగుబడి ఉంటుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో ఈ నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయంటారు. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్తు ఉత్పత్తికి ముఖ్యమైన జలాశయాలను తిరిగి నింపడానికి ఈ రుతు పవనాలే ఆధారంగా చెప్పొచ్చు. దేశ జీడీపీ తోడ్పాటుకు కూడా ఇవి ఎంతో కీలకం.