అక్షరటుడే, వెబ్డెస్క్: Coconut water : కొబ్బరి నీటిని ‘సహజ సూపర్ డ్రింక్’ అని పిలుస్తారు. ఇందులో కేలరీలు తక్కువగా, ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే, ఇది అందరికీ మేలు చేయదు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీటిని తాగడం వలన ప్రయోజనం కంటే హాని ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి ఈ పానీయం ఎప్పుడు ఆటంకం కలిగిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Coconut water : కొబ్బరి నీరు తాగకూడనివారు:
శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా, ఈ కింద పేర్కొన్న వ్యక్తులు కొబ్బరి నీళ్లు తాగే ముందు డాక్టరును సంప్రదించాలి.
మధుమేహం ఉన్నవారు: కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు ఉంటాయి (200 మి.లీ.కి 6–7 గ్రాములు). ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది, ముఖ్యంగా పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు. ప్యాక్ చేసిన నీళ్లలో అదనపు చక్కెర ఉండే అవకాశం ఉంది.
అలెర్జీలకు గురయ్యేవారు: కొబ్బరి అలెర్జీలు అరుదుగా ఉన్నా, సున్నితత్వం ఉన్నవారిలో దద్దుర్లు, వాపు, శ్వాసకోశ సమస్యలు లేదా అనాఫిలాక్సిస్కు దారితీయవచ్చు.
మూత్రపిండాల (Kidney) సమస్యలు ఉన్నవారు: కొబ్బరి నీటిలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు సరిగా పనిచేయనివారు దీనిని సమర్థంగా ఫిల్టర్ చేయలేరు. ఇది రక్తంలో పొటాషియం పెరగడానికి (హైపర్కలేమియా) దారితీసి, గుండె సమస్యలను కలిగిస్తుంది.
జలుబు, ఫ్లూ ఉన్నవారు: ఆయుర్వేదం ప్రకారం, కొబ్బరి నీరు చల్లబరిచే స్వభావం కలిగి ఉంటుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఇది శ్లేష్మం ఉత్పత్తిని పెంచి, పరిస్థితిని మరింత తీవ్రం చేయవచ్చు.
అధిక రక్తపోటు : రక్తపోటు తగ్గించే కొన్ని మందులు (ACE ఇన్హిబిటర్లు).. శరీరం పొటాషియంను నిలుపుకొనేలా చేస్తాయి. అదే సమయంలో కొబ్బరి నీరు తాగితే, పొటాషియం స్థాయిలు బాగా పెరిగి గుండె సంబంధిత సమస్యలు రావచ్చు.
ఎలక్ట్రోలైట్ నియంత్రిత ఆహారం పాటించేవారు: గుండె జబ్బులు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారికి తక్కువ పొటాషియం ఉండే ఆహారం సూచిస్తారు. కొబ్బరి నీటిలోని ఎలక్ట్రోలైట్లు ఈ సమతుల్యతను దెబ్బతీస్తాయి.
కొబ్బరి నీరు ఆరోగ్యకరమే అయినా, శరీరం పట్ల శ్రద్ధ వహించండి. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, కొబ్బరి నీరు తాగే ముందు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం.