అక్షరటుడే, వెబ్డెస్క్ : Kavitha Janam Bata | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనంబాట కార్యక్రమంలో భాగంగా శనివారం వరంగల్, హన్మకొండలో పర్యటించారు. రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో పర్యటిస్తామని ఆమె తెలిపారు.
మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావంతో ఇటీవల వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసిన విషయం తెలిసిందే. హన్మకొండ, వరంగల్లోని చాలా కాలనీలు నీట మునిగాయి. సమ్మయ్యనగర్లో వందలాది ఇళ్లు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో సమ్మయ్యనగర్ (Sammayyanagar)లో శనివారం కవిత పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడారు. పలు కుటుంబాలకు జాగృతి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)పై తీవ్ర విమర్శలు చేశారు.
Kavitha Janam Bata | బాధితులను ఆదుకోవాలి
వరద బాధితులను ఆదుకోవాలని కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. ఇటీవల ఇక్కడ పర్యటించిన సీఎం అనేక మాటలు చెప్పారన్నారు. అయితే ఇప్పటికీ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. వరద బాధితులకు తక్షణ సాయం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 150 ఇళ్లు కొట్టుకుపోయినా ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. బాధితులకు సాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే వరంగల్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయన్నారు.
Kavitha Janam Bata | బకాయిలు విడుదల చేయాలి
ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిలు వెంటనే విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. రీయింబర్స్మెంట్ కోసం కాలేజీలు ఇటీవల బంద్ పాటించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం శుక్రవారం మాట్లాడుతూ కాలేజీల తీరుపై మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలపై కవిత స్పందించారు. వీధి రౌడీలు సిగ్గు పడేలా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడరన్నారు. కాలేజీ ఓనర్ల తాటా తీస్తా, తోలు తీస్తానని అనడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకోసం తోలు తీస్తారని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డల కోసం కాలేజీలు పెట్టిన వారి తోలు తీస్తామనడం సరికాదన్నారు. ప్రభుత్వం బకాయిల విషయంలో మాట తప్పడంతోనే వారు కాలేజీలు బంద్ పెట్టారన్నారు. కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చే రేవంత్రెడ్డి కాలేజీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తాము కాలేజీలకు అండగా ఉంటామన్నారు. అలాగే విద్యార్థులు నష్టపోకుండా కాలేజీలు చర్యలు చేపట్టాలని కోరారు.
