అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సీఎంవో అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్ (GHMC)తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కుంటలు నిండి వరద నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.