అక్షరటుడే, హైదరాబాద్: CMRF : నిరుపేదలకు వైద్య సహాయం అందించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సీఎం సహాయ నిధి (#CMRF) సరికొత్త రికార్డును నెలకొల్పింది. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సహాయం అందించడంలో గడిచిన రెండేళ్లలో (7 డిసెంబరు 2023 నుంచి 6 డిసెంబరు 2025) సీఎంఆర్ఎఫ్ కింద మునుపెన్నడూ లేని విధంగా రూ. 1685.79 కోట్ల సాయం అందించింది.
2014-24 మధ్య కాలంలో ఈ సరాసరి రూ. 450 కోట్లు అందిస్తే.. గడిచిన ఈ రెండేళ్లలో ఏటా సుమారు రూ. 850 కోట్ల సహాయం అందించడం గమనార్హం. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు విడుదల చేసింది. రెండేళ్లలో మొత్తం రూ. 1685.79 కోట్లు అందించింది. అందులో వైద్య బిల్లుల రీయింబర్స్మెంట్ కోసం రూ. 1152.10 కోట్లు చెల్లించడం ద్వారా 3,76,373 మందికి సహాయం అందింది.
ఉచిత వైద్యం కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) గా 533.69 కోట్లు చెల్లించడం ద్వారా 27,421 మంది వైద్య చికిత్సలు పొందారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పౌరులకు అందిస్తున్న చికిత్సలకు సీఎంఆర్ఎఫ్ అదనం.
CMRF : దళారుల ప్రమేయం లేకుండా..
ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిన సందర్భంలో బిల్లులు చెల్లించిన తర్వాత అయిన ఖర్చులో కొంత భాగాన్ని తిరిగి చెల్లించవలసిందిగా సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వైద్యం కోసం నిర్ధిష్ట ప్రభుత్వ ఆసుపత్రుల్లో (నిమ్స్, ఎంఎన్జే, క్యాన్సర్ హాస్పిటల్, ప్రభుత్వ ఈఎన్టీ వంటి) చేరినప్పుడు చికిత్స కోసం ఖర్చు ప్రభుత్వం చెల్లిస్తుందన్న హామీ ఇచ్చే అధికారిక లేఖ జారీ చేస్తుంది. ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండానే చికిత్స చేయించుకోవచ్చు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పౌరులకు అందిస్తున్న చికిత్సలకు సీఎంఆర్ఎఫ్ అదనం. దళారుల ప్రమేయాన్ని తగ్గించి పారదర్శకతను పెంచడానికి దరఖాస్తుల ప్రక్రియను సీఎంఆర్ఎఫ్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన సమాచారం, సహాయం కోసం దరఖాస్తుదారులు సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ కార్యాలయంలో నేరుగా లేదా 040-23455662 నంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చు.