అక్షరటుడే, వెబ్డెస్క్ : Group-2 Jobs | రాష్ట్రంలో గ్రూప్–2 ఉద్యోగాలు సాధించిన వారికి ఈ నెల 18న సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) నియామక పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు (CS Ramakrishna Rao) మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
టీజీపీఎస్సీ (TGPSC) ఆధ్వర్యంలో గతంలో గ్రూప్–2 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 783 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి గ్రూప్–1 ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్-2 అభ్యర్థులకు ఈ నెల 18న నియామక ఉత్తర్వులు అందించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Group-2 Jobs | సమీక్షించిన సీఎస్
సీఎం రేవంత్రెడ్డి శిల్పకళా వేదికలో నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించడానికి ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం సచివాలయంలో సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రూప్-2 నియామకం ద్వారా ఎంపికైన మొత్తం 783 మంది అభ్యర్థులను దాదాపు 16 వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లో నియమించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులను ఆహ్వానించినట్లు రామకృష్ణారావు తెలిపారు.
ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల ధృవీకరణను వేగవంతం చేయాలని, ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం జరిగే రోజు సాయంత్రం 4 గంటలలోపు అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను శిల్పకళా వేదికలోకి అనుమతించాలని సూచించారు. అభ్యర్థుల్లో ఎక్కువ మంది జనరల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, పంచాయతీ రాజ్ వంటి విభాగాలకు చెందినవారు ఉన్నారు. ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా రెవెన్యూ, హోం, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని ప్రధాన కార్యదర్శి కోరారు.