అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ( Jubilee Hills by-election) ప్రచారంలో భాగంగా ఆపరేషన్ సిందూర్‌పై (Operation Sindoor) సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆదివారం సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. కాగా, వెంటనే పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. అనంతరం బీజేపీ నాయకులు సీఎం చిత్రపటాన్ని దహనం చేశారు.
ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క మంచి పని చేయకపోవగా, ఓటు అడిగే ముఖం లేక సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైనికుల త్యాగాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో ఓటమి భయంతోనే బీజేపీ, కేంద్ర మంత్రులపై సీఎం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లోకి సరిహద్దు వివాదాలను, సైనికులను తీసుకురావద్దని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని, అలాంటి కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఆపసోపాలు పడుతుందని ఎద్దేవా చేశారు.
