అక్షరటుడే, వెబ్‌డెస్క్: MP Arvind | వెనుకబడిన తరగతుల ప్రజలతో సీఎం రేవంత్‌రెడ్డి ఆడుకుంటున్నాడని.. ఆయనది చేతకాని పాలన అని ఎంపీ అర్వింద్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వెనుకబడిన వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడని మండిపడ్డారు. రిజర్వేషన్ల అంశంలో ఆయనకు చిత్తశుద్ధి లేదన్నారు. రాజ్యంగ సవరణ లేకుండా రిజర్వేషన్ల పెంపు ఎలా సాధ్యమవుతుందని అనుకున్నారని ప్రశ్నించారు. తెలిసి కూడా జీవో ఇచ్చారన్నారు. రేవంత్ పాలనపై రైతులు, యువత, మహిళలు, ఎన్నారైలు ఇలా అందరూ అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ముందు లేనిపోని హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను పిచ్చోళ్లను చేశారన్నారు. కాళేశ్వరం కేవలం కమీషన్ల కోసమే కట్టారని కాంగ్రెస్సే వేసిన కమిటీ నివేదించినప్పటికీ కల్వకుంట్ల కుటుంబంపై (Kalvakuntla family) ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఈ–కార్ రేసులో కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదో సమాధానం చెప్పాలన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో (phone tapping case) ఓ ఉన్నతాధికారిపై ఆధారాలు దొరికినప్పటికీ ఏమీ చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. కవిత ఎమ్మెల్సీగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యువత, మహిళలు, ఎన్నారైలు, రైతులు పూర్తిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆయన విమర్శించారు.
వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని మోదీ ప్రభుత్వం (Modi government) అమలు చేసి చూపిందని స్పష్టం చేశారు. తెలంగాణలో రాజ్యాంగ సవరణ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి కూడా ఇలాంటి చర్యలు తీసుకుని కాంగ్రెస్ అభాసుపాలైందని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి కేసీఆర్ కుటుంబంలో ఉన్న కేటీఆర్, సంతోష్‌రావు, హరీష్‌రావులతో దోస్తానా ఏమిటో బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.